Mega Star: వరద బాధితులకు మెగాస్టార్ చిరంజీవి ఆపన్నహస్తం.. తెలుగు రాష్ట్రాలకు భారీగా విరాళం
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చాయి.
దిశ, వెబ్‌డెస్క్: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయారు. అయితే, వదర బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు సీఎం రీలీఫ్ ఫండ్‌కు భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు సాయంగా రూ.కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నా. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు.
More News : ఏపీ, తెలంగాణకు విరాళం ప్రకటించిన రామ్ చరణ్