దిశ, తెలంగాణ బ్యూరో : వ్యక్తిగత పర్యటన నిమిత్తమే కేసీఆర్ ఢిల్లీ వచ్చినట్లు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ చెప్పినా ఫస్ట్ పొలిటికల్ మీటింగ్ గురువారం చోటుచేసుకున్నది. బీజేపీ ఎంపీ అయినా ప్రధాని మోడీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సుబ్రమణ్య స్వామి సుమారు గంట సేపు కేసీఆర్‌తో ఆయన నివాసమైన తుగ్లక్ రోడ్డు బంగళాలో ముచ్చటించారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభావంపై చర్చించినట్లు తెలిసింది. మర్యాదపూర్వక భేటీ అని సుబ్రమణ్య స్వామి చెప్పినా గంట సేపు పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అదే సమయంలో రైతు నాయకుడు రాకేష్ టికాయత్ కూడా ఆ సమావేశానికి హాజరై కొద్దిసేపు మాట్లాడారు.
సుబ్రమణ్య స్వామి వెళ్ళిపోయిన తర్వాత రాకేష్ టికాయత్‌తో కేసీఆర్ పలు అంశాలపై లోతుగా చర్చించారు. దాదాపు గంటన్నర పాటు వీరి మధ్య భేటీ జరిగింది. రైతాంగ సమస్యలతో పాటు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలు, ఫలితంగా ఆ రంగంలో ఏర్పడుతున్న సంక్షోభం, సాగు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోడానికి స్ఫూర్తిగా నిలిచిన ఉత్తరాది రైతుల అలుపెరుగని పోరాటం, కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వంపై రానున్న పార్లమెంటు సమావేశాల్లో ఒత్తిడి పెంచడానికి వివిధ పార్టీల సహకారాన్ని కూడగట్టడం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ప్రగతి భవన్‌లో ఫిబ్రవరి 28న పలువురు మంత్రులు, అధికారులతో చర్చించి ఢిల్లీ వెళ్ళిన కేసీఆర్ మూడు రోజుల పాటు ఏ రాజకీయ సమావేశంలో పాల్గొనలేదు. ఈ ఇద్దరి నేతలతో గురువారం భేటీ కావడమే తొలి సమావేశం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో, మమతా బెనర్జీతో మీటింగ్ ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు లీకులిచ్చినా ఆ భేటీ జరగలేదు.