'మెడికల్ కౌన్సిల్ ఆగమాగం..?'.. ఆన్​లైన్​ ఉన్నా.. రిజిస్ట్రేషన్లు ఆలస్యమే

మెడికల్ కౌన్సిల్ టెక్నికల్ సమస్యలు డాక్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Update: 2023-07-12 17:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్ కౌన్సిల్ టెక్నికల్ సమస్యలు డాక్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ ​కొరకు డాక్టర్లు అవస్థలు పడుతున్నారు. ఈ నెల 20 వరకు రిజిస్ట్రేషన్, రెన్యువల్స్​ఉన్నోళ్లే ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులుగా టీఎస్​కౌన్సిల్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో తమ ఓటును కోల్పోతామని చాలా మంది డాక్టర్లు ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇటీవల ఆన్​లైన్‌లో రిజిస్ట్రేషన్​చేసుకోవచ్చని మంత్రి హరీష్​రావు ఓ పోర్టల్‌ను ప్రారంభించారు. కానీ అది వర్క్​చేయడం లేదని డాక్టర్లు విమర్శిస్తున్నారు. చేసేదేమీ లేక చాలా మంది డాక్టర్లు రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్​కొరకు కోఠిలో కౌన్సిల్‌లో క్యూ కట్టాల్సిన పరిస్థితి దాపరించింది. ఎంబీబీఎస్​పూర్తి చేసినోళ్లు కౌన్సిల్‌లో ఒక సారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత.. ప్రతి ఐదేళ్లకు ఓ సారి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఎన్నికల అర్హులకు కౌన్సిల్ ఇచ్చిన గడువు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పుడు డాక్టర్లంతా ఆందోళన చెందుతున్నారు. ఆన్​లైన్​పనిచేయకపోవడంతో అడ్రస్​అప్టేట్స్, ఈ మెయిల్, ఫోన్​నంబర్ల సవరణలు చేసేందుకు వీలుండదు. దీని వలన ఆన్​లైన్​ఓటింగ్‌లో పాల్గొనే ఛాన్స్​ఉండదు. ఇక సరైన అడ్రస్​లేకపోతే పోస్టల్ బ్యాలెట్ విధానానికి కౌన్సిల్ అంగీకరించదు. దీంతో ఓట్లు మిస్​అయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుతం కౌన్సిల్‌కు ప్రతి రోజు ఐదారు వందల మంది వస్తుండగా, సగటున 100 మంది కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్, రెన్యువల్స్​చేయలేకపోతున్నట్లు స్వయంగా కౌన్సిల్​అధికారేలే వాపోతున్నారు. దీంతో చాలా మంది ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉన్నదని సీనియర్​డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

సాధారణ ఎన్నికల తరహాలో..?

త్వరలో జరగబోయే టీఎస్​మెడికల్ కౌన్సిల్ ఎన్నికలకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఈ సారి కాంపిటేషన్​భారీగా ఉండనున్నది. సాధారణ ఎన్నికల తరహాలో ఎలక్షన్లు జరిగే ఛాన్స్​ఉన్నదని డాక్టర్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్ధులు, మద్ధతు కోసం రిజిస్ట్రేషన్​డాక్టర్లను సంప్రదిస్తూనే ఉన్నారు. సుప్రీం కోర్టు సైతం ఆగస్టు 16 లోపు కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దీంతో అధికారులు, డాక్టర్లను ఎన్నికలకు రెడీ అవుతున్నారు. షెడ్యూల్‌ను విడుదలకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మెడికల్ కౌన్సిల్‌లో 25 పోస్టులు ఉన్నాయి. వీటిలో 12 పోస్టులను ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. మిగతా 13 పోస్టులకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కొరకు దాదాపు రెండు నుంచి మూడు వందల మంది డాక్టర్లు పోటీలో ఉంటారు. ఎంబీబీఎస్​పూర్తి చేసి కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్​పొందిన ఎవరైన పోటీ చేయొచ్చు. ఒక్కో డాక్టర్ 13 మందికి ఓట్లు వేయొచ్చు. టాప్​13 అభ్యర్ధులను సెలక్ట్ చేస్తారు.

ఓటర్ల లిస్ట్ రిలీజ్ చేయాలి.. డాక్టర్ రాజీవ్ జూడా చీఫ్ అడ్వైజర్

మెడికల్ కౌన్సిల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. డాక్టర్లను ఇబ్బంది పెడుతున్నది. ఎన్నికలకు మరెంతో సమయం లేదు. కానీ ఓటర్ల వివరాలు ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేగాక ఆన్​లైన్​ లో రిజిస్ట్రేషన్, రెన్యువల్స్ జరగడం లేదు. దీని వలన అతి తక్కువ సమయంలో డాక్టర్లు ఓట్ అర్హత సాధించడం కష్టం. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని డాక్టర్ల సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది.


Similar News