Eatala Rajendar: పేదల శవాలతో నీ పాలన సాగిస్తానంటే నీ ఖర్మ.. రేవంత్ రెడ్డిపై ఈటల ఫైర్
సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతంలోని పేదల ఇళ్లు కూల్చి వారి శవాలమీదనే నీ పరిపాలన సాగిస్తానంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖర్మ అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. కళ్ళు నెత్తికెక్కి ప్రజల జీవితంతో చెలగాటం ఆడిన గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో ఈ ప్రభుత్వానికి అదే గతి పడుతుందన్నారు. బుధవారం రామాంతపూర్ లోని బాలకృష్ణ నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఈటల రాజేందర్ నేతృత్వంలోని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, శిల్పారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బృందం పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా స్థానికుల సమస్యలను బీజేపీ ప్రతినిధి బృందం అడిగి తెలుసుకుంది. తమ ఇళ్లను కూల్చివేస్తారనే ప్రచా జరుగుతున్నదని తమను ఆదుకోవాలని ఈటలను స్థానికులు కోరారు. ఈ సందర్భంగా ఓ చానల్ తో మాట్లాడిన ఈటల.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదరగొట్టే రీతిలో రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప నిజంగా ప్రజల ఆవేదన ఏంటో క్షేత్రస్థాయిలోకి వస్తే తెలుస్తుందన్నారు. తమ లాంటి వారు మాట్లాడితే రెచ్చగొడుతున్నారని విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు.
మూసీలో విషతుల్యం లేని నీటిని నింపడానికి ఇళ్లు కూల్చాల్సిన పని లేదన్నారు. నదిలోకి రసాయనాలు, డ్రైనేజీ కలవకుండా ముందు ఆపాలన్నారు. ఇక్కడి పేదలను పంపించి ఆ స్థలాలను బడా మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, మూసీలో మురికి నీళ్లు పారాలని తాము కోరుకోవడం లేదన్నారు. కానీ పేదల బతుకుల్లో మట్టి కొట్టి మూసీ ప్రక్షాళన చేస్తామంటూ ఊరుకునేది లేదన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసే దమ్ములేక ప్రజల దృష్టి మళ్లీంచి పేదల జీవితాలతో చెలగాటం ఆడే ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డికి నిజాయితీ లేదన్నారు. గంగా ప్రక్షాళనలో ఒక్క ఇళ్లు కూల్చింది లేదన్నారు. గంగా ప్రాజెక్టు గత పదేళ్లుగా రూ. 20 -30 వేల కోట్లు మాత్రమేనని, సబర్మతిలో రూ. 14-2 వేల కోట్లు మాత్రమేనని కానీ మూసీకి ఈ ప్రభుత్వం చెబుతున్నది 1 లక్ష 50 వేల కోట్లు చెబుతున్నారని ఇదంతా ఓ డ్రామా అన్నారు.