పూర్తిస్థాయిలో మందులు అందించే ప్రయత్నం చేస్తాం : మల్కాజిగిరి ఎంపీ
తిరుమలగిరి మండలం బొల్లారంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న
దిశ,తిరుమలగిరి : తిరుమలగిరి మండలం బొల్లారంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలు,రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు,వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం రోగులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలను కూడా తెలుసుకున్నారు.అవుట్ పేషంట్ విభాగంలో డాక్టర్స్,సిబ్బందిని కలిసి,ఇన్ పేషంట్ విభాగంలో ప్రతి బెడ్ వద్దకు వెళ్లి రోగులతో వారి జబ్బు,అందుతున్న చికిత్సల గురించి వారినే స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రిలోని బాత్ రూంలు పరిశీలించి,వాటిని నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు.
ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్,రేబిస్ వ్యాక్సిన్,మందులు అందుబాటులో లేవని,ఎక్స్ రే,బ్లడ్ టెస్టులకు డబ్బులు తీసుకుంటున్నారని,అంతేకాకుండా రాత్రిపూట వైద్యులు అందుబాటులో ఉండటం లేదని,అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది అవుతుందని వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజలు ఎంపి దృష్టికి తీసుకువచ్చారు.ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం కంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావడమే మంచిదని వస్తున్నామని,కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత,సిబ్బంది చేతివాటం తమను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తుందని వారు ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించడానికి ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు.
అయితే ఆసుపత్రిలో అవసరమైనన్ని నిధులు లేవని సిబ్బంది ఎంపి కి తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు కడు బీదరికం ఉన్నవారు మాత్రమే వస్తుంటారని,ఆసుపత్రికి వచ్చేవారికి చికిత్స,మందులు అందించడం కోసం డాక్టర్లు నర్సులు సరిగ్గా అందుబాటులో లేరు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో శనివారం తాను ఆసుపత్రిని పరిశీలించినట్లు తెలిపారు.గాంధీ,ఉస్మానియా లాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో విపరీతంగా పేషెంట్లు పెరిగిపోయి సౌకర్యాలు తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారనే సమస్యలు తన దృష్టికి వచ్చాయని,మల్కాజ్ గిరి పరిధిలోని కంటోన్మెంట్ ఆసుపత్రి,అర్బన్ హెల్త్ సెంటర్లను పరిశీలించి ప్రజలు,సిబ్బందితో తాను మాట్లాడానని ఆస్పత్రులలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
పూర్తిస్థాయిలో మందులు అందించే ప్రయత్నం చేస్తామని,డెలివరీలు తక్కువ అవుతున్నాయని,నెలకు 4నుండి5మాత్రమే అవుతున్నాయని,పెంచే ప్రయత్నం చేస్తామని డాక్టర్లు,సిబ్బంది,పరికరాలు,మందులు సంపూర్ణంగా అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని తెలిపారు.పురాతనమైన ఆసుపత్రిగా ఈ ఆసుపత్రిలో ఈ ప్రాంత ప్రజలకు రూపాయి భారం లేకుండా ఆరోగ్యం అందించే ప్రయత్నం చేస్తామని ఎంపి అన్నారు.ఆయన వెంట స్థానిక నాయకులు సిబ్బంది ఉన్నారు.