లైఫ్ సైన్సెస్ హబ్ గా తెలంగాణ.. మంత్రి శ్రీధర్ బాబు

ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారబోతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Update: 2024-09-16 17:05 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారబోతుందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జినోమ్ వ్యాలీలో సోమవారం ఆయన నూతనంగా ఏర్పాటు చేసిన లారస్ లైఫ్ సైన్సెస్, త్రీ 3 జీవి లైఫ్ సైన్సెస్ ప్రాంగణాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించబడిన అత్యాధునిక ల్యాబ్స్ వలన 3 వేల కోట్ల విలువైన పెట్టుబడులతో పాటుగా 10 వేల ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు. లారస్ ల్యాబ్స్ వారు యూరోపియన్ కంపెనీతో భాగస్వామిగా ఉంటూ రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో 2 వేల 250 కోట్ల రూపాయల అదనపు పెట్టుబడితో పాటుగా, 2 వేల 8 వందల ఉద్యోగాలను కల్పించే దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న 3 జీవి లైఫ్ సైన్సెస్ 105 కోట్ల పెట్టుబడితో వెయ్యి ఉద్యోగాల కల్పిస్తుందని తెలిపారు. అదేవిధంగా పరిశోధన సంస్థలు, స్టార్టప్ ల కోసం 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన బయో పోలీస్ ప్రాంగణాన్ని ఆయన ప్రారంభించారు.

అధునాతన లైఫ్ సైన్సెస్ పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, దీనివలన రాబోయే రోజుల్లో 6500 ఉద్యోగాల కల్పనతో పాటుగా మరో ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నామని తెలిపారు. అనంతరం ఆయన భారత్ బయోటెక్, సింజీన్, బయోలాజికల్ ఇ, జాంప్ ఫార్మా మొదలైన కంపెనీలకు చెందిన కీలక పరిశ్రమల ప్రతినిధులతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, అందిస్తున్న సహకారం తదితర అంశాల పై చర్చించారు. తెలంగాణ రాష్ట్రం లైఫ్ సెన్సెస్, బయోటెక్నాలజీ హబ్ లకు అడ్డాగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉండబోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ ఐసీసీ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి, ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌతమ్, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ గోయల్ వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Similar News