Etala Rajender : రేవంత్ రెడ్డిది నడమంత్రపు సిరి
పేదల బతుకులో రేవంత్ సర్కారు మట్టి కొడుతుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు.
దిశ,మేడ్చల్ బ్యూరో : పేదల బతుకులో రేవంత్ సర్కారు మట్టి కొడుతుందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. గురువారం మల్కాజ్ గిరి లో, వినాయకనగర్ డివిజన్ లో హైడ్రా బాధితులతో ఎంపీ ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. 35 ఏళ్ల క్రితం బండ చెరువు చుట్టూ కాలనీలు శివానంద నగర్, కృష్ణ నగర్, ఆర్టీసీ కాలనీ, శంకరయ్య కాలనీ, పిబి కాలనీ, పిబి సూర్య కాలనీ, బృందావన్ కాలనీ, సంతోషిమా కాలనీ, సింహాద్రి కాలనీ, ఎన్బిసి కాలనీ, శివగౌరీ కాలనీ, లక్ష్మీ నగర్, జైన్ మందిర్, చంద్రగిరి కాలనీ, లాల్వాని నగర్, సప్తగిరి కాలనీ, అనంతసాగర్.. ఇలా బండ చెరువు చుట్టూ 18 కాలనీలు 35 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని బాధితులు ఎంపీ ఈటల దృష్టికి తీసుకువచ్చారు. చిరు ఉద్యోగులు, రోజువారి కూలీలు, పేదవారు జాగాలు కొనుక్కొని ఒక తరం కష్టపడి ఇల్లు నిర్మించుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ... ఒకవైపు పేదల ఇండ్లకు కూలగొట్టడం నిశ్చింతగా ఉండండి అని రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లు చెప్తూ మరోపక్క ఎఫ్ టి ఎల్ బఫర్ జోన్ల పేరుతో మార్కింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓటు వేసి గెలిపించిన పాపానికి లక్షలాది ఇళ్లలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శని, ఆదివారాలు వస్తే ఎక్కడ బుల్ డోజర్లు వస్తాయో నని బిక్కుబిక్కుమంటూ బ్రతకడానికి కారణం రేవంత్ రెడ్డి నువ్వు కాదా ? అని ప్రశ్నించారు.
ప్రజల కళ్ళలో నీళ్లు చూసి సంతోషపడే వాడు మనిషి కాదు శాడిస్ట్ అవుతారని దుయ్యబట్టారు. నాకు కోర్టులు, చట్టాలు, రాజకీయ నాయకులు లెక్క కాదు అని హైడ్రా అధికారులు మాట్లాడుతున్నారని, నిర్మాణం చేయడం కష్టం.. రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా జమ చేసుకొని కట్టుకుంటే.. క్షణాల్లో కూల్చివేసే అధికారం నీకు ఎవరిచ్చాడు ? నువ్వు ఎవరివి ? అని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ మునిగిపోవాలని, వరదలు రావాలని, అక్రమ నిర్మాణాలు చేపట్టాలని ఎవరు కోరుకోవడం లేదు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఐమ్యాక్స్, ఎన్టీఆర్ ఘాట్, నక్లెస్ రోడ్, బిర్యానీ సెంటర్లో వస్తే ఓకేనా..? అని ధ్వజమెత్తారు.
పేదల బ్రతుకుల్లో మట్టి కొడుతున్న దుర్మార్గ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అని అన్నారు.కోర్టులు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా జ్ఞానం రావడం లేదన్నారు. హైడ్రా బాధితులు అందరితో కలిసి త్వరలో దీక్ష చేస్తానన్నారు. రేవంత్ రెడ్డి నీవు కొడంగల్ లో ఓడిపోతే మల్కాజ్గిరి ప్రజలు ప్రాణం పోశారు. మల్కాజ్గిరి ప్రజలు ఏం పాపం చేశారని, కొడంగల్ లో బొందపెడితే.. ఇక్కడికి వచ్చి బిక్షపెట్టమని అడిగితే గెలిపిస్తే వారి మీద కక్ష తీర్చుకోవడం ఎంతవరకు భావ్యం అని మండిపడ్డారు. ప్రజల ఆవేదన చూడండి.. వాళ్ళ ఆవేదన తో మాట్లాడుతుంటే డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నామని చెప్పడం ప్రజలను అవమానించడమేనని అన్నారు. మీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. ప్రజలతో గోక్కున్నవాడు ఎవరూ బాగుపడలేదు.. మీరు కూడా మట్టి కొట్టుకపోవడం ఖాయమన్నారు.