Patnam Mahender Reddy : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని

Update: 2024-09-17 09:51 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలను మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమర వీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది మహనీయుల త్యాగాల పోరాట ఫలితంగానే తెలంగాణ ఏర్పడిందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.


ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి జాప్యం లేకుండా పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తూ సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఋణ భారంతో బతుకు భారమైన తెలంగాణ రైతన్న నేడు “రైతు నేస్తం” పథకం ద్వారా అందించే రైతు ఋణమాఫీ తో రైతులు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన “మహాలక్ష్మి” పథకం ద్వారా ఇచ్చిన గ్యారెంటీలతో రాష్ట్రమంతటా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తుందన్నారు. “మహాలక్ష్మి” వంట గ్యాస్ సబ్సిడీ పథకం ద్వారా మన జిల్లాలో 500 రూపాయలకే అర్హులైన 74వేల 457 మంది లబ్దిదారులకు నేటి వరకు ఒక లక్ష 72 వేల 393 గ్యాస్ సిలిండర్లను, గృహ జ్యోతితో పేదల ఇంట వెలుగులు ఆడబిడ్డ కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరాల ద్వారా లబ్దపొందుతున్నారని మహేందర్ రెడ్డి వివరించారు.


వైద్యం అందక ఏఒక్కరి ప్రాణాలు పోకూడదనే ఆశయంతో కొత్తగా 163 రకాల చికిత్సలను చేరుస్తూ.. మొత్తం 1835 రకాల చికిత్సలు, 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు “రాజీవ్ ఆరోగ్య శ్రీ” పథకం ద్వారా సత్వర ఉచిత వైద్యం అందించడమే కాకుండా, రాష్ట్రీయ బాలల స్వాస్థ కార్యక్రమం క్రింద పాఠశాల విద్యార్థులకు చేసే వైద్య పరీక్షల్లో రాష్ట్రంలోనే మన జిల్లా మొదటి స్థానంలో ఉందని తెలిపారు.నాణ్యమైన విద్యతోపాటు విజ్ఞాన, నైపుణ్య, సామర్థ్యాలను పెంచుతూ విద్యార్థులను తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు ఆదర్శవంతమైన పౌరులను సమాజానికి అందించడానికై రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలను రూపకల్పన చేసి వారికి బంగారు భవిష్యత్తుకై కృషి చేస్తోందన్నారు. మాతా శిశు మరణాలు లేకుండా ఉండేందుకు వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే ప్రభుత్వం ద్వారా మన జిల్లాలో 7 వందల 93 అంగన్ వాడీ కేంద్రాల ద్వారా 64 వేల 169 మంది పిల్లలకు, 9 వేల 358 మంది గర్బిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం, ఇమ్యూనైజేషన్ అందిస్తుందన్నారు. అంతే కాకుండా మహిళలు, చిన్నారుల భద్రత కోసం “టీ సేఫ్” యాప్ ద్వారా 24 గంటలు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులైన వారందరికీ అందిస్తూ సామాజిక అభివృద్ధి లో ముందుకు సాగేందుకు మీరందరు సహకరించాలని మహేందర్ రెడ్డి కోరారు.


ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ పోట్రు, డీసీపీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాకారుల పాడిన తెలంగాణ గీతాలు ఆహుతులను అలరించాయి.


Similar News