నియంతలా ఎమ్మెల్యే.. మేము లేకుండా శంకుస్థాపన చేశారంటూ కార్పొరేటర్ల ఆగ్రహం..
ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి శంకుస్థాపనలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
దిశ, ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి శంకుస్థాపనలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాము లేని సమయంలో శంకుస్థాపనలకు ఎమ్మెల్యే శ్రీకారం చుడుతున్నారని కార్పొరేటర్లు మండిపడుతున్నారు. ఇటీవల వనస్థలిపురంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి శంకుస్థాపనలపై స్థానిక కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి తాను లేని సమయం చూసి శంకుస్థాపనలు చేశారంటూ మండిపడ్డ విషయం తెలిసింది. ఇది మరువక ముందే మన్సురాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి శబరిమలైకి వెళ్లిన సమయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపనలు చేయడం మరోసారి వివాదాస్పదంగా మారింది.
అయితే స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహా రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు తాను అందుబాటులో ఉండడం లేదని ముందుగానే సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయితే అధికారులు కార్పొరేటర్ అందుబాటులో లేరని చెప్పినా.. ఎమ్మెల్యే మాత్రం వ్యక్తిగత స్వార్థం కోసం తాను అందుబాటులో లేని సమయం చూసి అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టాడని ధ్వజమెత్తారు. పైగా ఏమీ తెలియనట్టు మీ కార్పొరేటర్ లేడా అంటూ స్థానిక కాలనీవాసులను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందంటూ మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో సుధీర్ రెడ్డి స్థానిక బీజేపీ కార్పొరేటర్లను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరుపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ నియంత సుధీర్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కొప్పుల నర్సింహా రెడ్డి హెచ్చరించారు.