పౌరసరఫరాల శాఖ మంత్రికి లేఖ రాసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే..
కొత్త రేషన్ కార్డుల జారీతో పాటుగా రేషన్ డీలర్ల సంక్షేమం పై పలు రకాల అభ్యర్థనలు సూచనలు చేస్తూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు.
దిశ, మేడ్చల్, బ్యూరో : కొత్త రేషన్ కార్డుల జారీతో పాటుగా రేషన్ డీలర్ల సంక్షేమం పై పలు రకాల అభ్యర్థనలు సూచనలు చేస్తూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. నియోజకవర్గంలో ఉన్న 76 వేల రేషన్ కార్డు దారులకు 105 దుకాణాల ద్వారా సేవలు అందిస్తున్న తరుణంలో ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలు ఈ లేఖలో పేర్కొన్నారు. తలసేమియా, హెచ్ఐవి వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగులతో పాటుగా కీమోథెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ రోగులు, డయాలసిస్ పేషంట్స్ కోసం కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని, స్థానికంగా శిబిరాలను కౌంటర్లను ఏర్పాటు చేసి ఈ ప్రక్రియను చేపట్టాలని కోరారు. అంతే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించేలా అప్డేట్ ప్రక్రియను టైం లైన్ లేకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారికి 35 కిలోల బియ్యాన్ని అందించాలని, స్మార్ట్ కార్డ్ సిస్టం ద్వారా పంపిణీ అయ్యే విధంగా చూడాలని కోరారు. రద్దు అయిన రేషన్ కార్డులను పునరుద్ధరణ చేసే విధంగా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
డీలర్ల సంక్షేమం కోసం..
కేవలం రేషన్ కార్డుల జారీ ప్రక్రియ గురించి మాత్రమే కాకుండా డీలర్ల సంక్షేమం కోసం పలురకాల అభ్యర్థులను, సూచనలను ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు. పిల్లల కమిషన్ 3 వేలకు పెంచాలని, హోంగార్డులు, జర్నలిస్టులు, డ్రైవర్స్ ప్లాట్ఫామ్ వర్కర్స్ లకు ఇస్తున్న విధంగానే రేషన్ డీలర్లకు సైతం జీవిత, ప్రమాద బీమా పాలసీలను అమలు చేయాలని కోరారు. డీలర్లకు సరుకులు సరఫరా చేసే సమయంలో గన్ని బ్యాగుల లీకేజీ సమస్యలను పరిష్కరించాలని, ప్రజా పంపిణీని ప్రతినెల 15వ తేదీకి మించి పొడిగించాలని సూచించారు. వేగంగా పట్టణ జనాభా పెరుగుతున్న క్రమంలో రేషన్ డీలర్లను కూడా పెంచాలని కోరుతూ ఆయన లేఖలో పేర్కొన్నారు.