వైభవంగా మల్లన్న జాతర.. కళ్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
శ్రీ మల్లిఖార్జున స్వామి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.
దిశ, మేడ్చల్ ప్రతినిధి: శ్రీ మల్లిఖార్జున స్వామి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మేడ్చల్ మండలంపూడూరు గ్రామంలో ఆదివారం గ్రామ యాదవ సంఘం సహకారం సర్పంచ్ బాబు యాదవ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతర వేడుకలు ఆద్యంతం భక్తి భావాన్ని పెంపొందించాయి. ఉదయం మల్లన్న, కేతమ్మల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. సోమేశ్ యాదవ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం అగ్ని గుండాలు, బండ్లు బోనాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
మహిళలు స్వామి వారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించారు. ఒగ్గు డోళ్ల తాళాలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు జాతరలో ఆకట్టుకున్నాయి. పూడూరు, గోసాయి గూడ తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో పూడూరు గ్రామం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది.
కళ్యాణోత్సంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు..
శ్రీ మల్లికార్జున స్వామి, కేతమ్మల కళ్యాణోత్సవంలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, కల్పనారెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తన వివాహ వార్షికోత్సవం రోజున స్వామి వారి కళ్యాణాన్ని తన చేతుల మీదుగా జరుపడం అదృష్టంగా భావిస్తామన్నారు. యాదవులతో తనకు చిన్ననాటి నుంచి మంచి స్నేహబంధం ఉందన్నారు. అనంతరం యాదవులు మల్లారెడ్డి దంపతులను, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిలను సత్కరించారు.
గ్రామ సర్పంచ్ బాబు యాదవ్ గొర్రెపిల్ల, గొంగడిలను బహుకరించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. భవన నిర్మాణానికి మంత్రి తనవంతు సాయంగా రూ.5 లక్షల విరాళాన్ని అందజేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ చైర్మన్ భాస్కర్ యాదవ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు యాదనంద్ యాదవ్, గొల్ల కిట్టు యాదవ్, నవీన్ యాదవ్, సాయి యాదవ్, పెద్ద గొల్ల బాలయ్య యాదవ్, మల్లేశ్ యాదవ్, గోపాల్ యాదవ్, క్రిష్ణ యాదవ్, ఉప సర్పంచ్ వెంకటేశ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రమేశ్, మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.