ఉత్తర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కు లైన్ క్లియర్
ఉత్తర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కు లైన్ క్లియర్ అయింది.
దిశ, మేడ్చల్ బ్యూరో : ఉత్తర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కు లైన్ క్లియర్ అయింది. మెట్రో రైలు ప్రాజెక్టు కోసం సీఎం రేవంత్ రెడ్డి నేడు సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్యారడైజ్ నుండి మేడ్చల్ వరకు, అలాగే అల్వాల్ మీదుగా శామీర్ పేట వరకు మెట్రో రైలు ప్రాజెక్టు కు మోక్షం లభిస్తుందని మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.మల్కాజిగిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి శాసనసభలో డిసెంబర్ 20వ తేదీన 2 ఫేస్ ఉత్తర హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ పై ప్రశ్న అడిగి ఉత్తర హైదరాబాద్ కు మెట్రో ప్రాజెక్టు ఆవశ్యకతను తెలియజేశారు.
అదే విధంగా రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను వివరించి వినతి పత్రం అందించారు. ఆ సందర్భంగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి ఉత్తర హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది అని మర్రి రాజశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల సౌకర్యార్థం సానుకూలంగా స్పందించి త్వరగా ఆదేశాలు ఇచ్చిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి మల్కాజిగిరి శాసన సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పుంజుకోకున్న రియల్ ఎస్టేట్ రంగం...
నగరం ఉత్తరం వైపు మెట్రో రైలు విస్తరణతో రియల్ రంగం దూసుకు పోనుంది. మేడ్చల్, శామీర్ పేట్ ప్రాంతాలలో మెట్రో విస్తరణతో భూముల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మెట్రో అనుసంధానం ఉన్న ప్రాంతాలతో పోలిస్తే ప్రస్తుతం ఇక్కడి చదరపు గజం విలువ తక్కువగా ఉంది. మెట్రో రాకతో ప్లాట్స్, భూములు ధరలకు రెక్కలు రానున్నాయి.
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు....
ప్రస్తుతం మేడ్చల్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ అలాగే శామీర్ పేట్ మీదుగా సికింద్రాబాద్ చేరుకోనున్న ప్రజలు ప్రతి నిత్యం ట్రాఫిక్ రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో నగరానికి రావడానికి గంటల కొద్దీ సమయం ప్రయాణంలోనే సరిపోతుంది. ఈ రెండు ప్రాంతాలకు మరి కొద్ది సంవత్సరాలలో మెట్రో విస్తరించడంతో ఇక్కడి ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సమయం ఆదా కాబోతుంది. మేడ్చల్, శామీర్ పేట్ కు చెందిన ప్రజలు కేవలం నిమిషాలలో మెట్రో మీదుగా జంట నగరాలు చేరుకొని తమ తమ పనులు చక్క బెట్టుకోవచ్చు.