టర్కీలో మల్లారెడ్డి అల్లుడు.. మంత్రి కూతురితో ఆ లాకర్లు తెరిపించిన అధికారులు!!

మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటిలో కూడా రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2022-11-23 14:52 GMT

దిశ,కంటోన్మెంట్/బోయిన్ పల్లి: మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంటిలో కూడా రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మర్రి రాజశేఖర్ రెడ్డి విహార యాత్రలో టర్కీలో ఉన్నాడు. దీంతో ఆయన కుమార్తె శ్రీయ రెడ్డి సమక్షంలో ఐటీ అధికారులు బోయిన్ పల్లి సౌజన్య కాలనీలోని ఆయన ఇంటిలో సోదాలు చేస్తూ శ్రీయను ప్రశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటిలో దొరికిన కీలక ఆధారాల ప్రకారం.. రాజశేఖర్ రెడ్డి సతీమణి, మల్లారెడ్డి కూతురు మమతా రెడ్డి, శ్రీయ రెడ్డిల బ్యాంకు ఖాతాలలో భారీగా డబ్బు, విలువైన భూముల పత్రాలు, హార్డ్ డిస్క్‌లు నగలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

మీడియా కంట పడకుండా ఆమెను ప్రభుత్వ వాహనంలో బ్యాంకులకు తీసుకువెళ్లి బ్యాంకు లాకర్లను తెరిపించి వారికి కావలసిన ఆధారాలను సేకరించి, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయమైన సమచారం. మరోవైపు మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఎమ్‌ఎల్‌ఆర్ విద్యాలయాల అధిపతి, టీఆర్ఎస్ నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి శుక్రవారం తెల్లవారు జామున టర్కీ నుండి హైద్రాబాద్‌కు చేరుకోనున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రశ్నించడానికి అధికారులు సోదాలు శుక్రవారం వరకు కొనసాగించనున్నట్లు సమాచారం.

మేము సహకరిస్తాము.. మాకు వయసు అయిపోయింది: మర్రి లక్ష్మణ్ రెడ్డి

ఐటీ అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తాం. మాకు వయసు అయిపోయింది.. మమ్మల్ని లేని పోని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టొద్దు. అన్ని తలుపులు తీసే ఉంచాము.. మీరు ఏదైనా, ఎక్కడైనా సోదాలు చేసుకోవచ్చు అని మర్రి రాజ శేఖర్ రెడ్డి తండ్రి అధికారులకు తెలిపారు. ఇక శుక్రవారం వరకు సోదాలు కొనసాగుతాయా..లేదా..? ఐటీ అధికారులు మర్రి రాజశేఖర్ రెడ్డి వచ్చే వరకు ఎదురు చూస్తారో చూడాలి.

Tags:    

Similar News