అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు..టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేతివాటం

మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ డి.పోచంపల్లి

Update: 2024-09-10 12:34 GMT

దిశ,దుండిగల్ : మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ డి.పోచంపల్లి 9వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అనుమతులు ఒకలా తీసుకున్న నిర్మాణదారులు బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండికొడుతున్నారు. మున్సిపల్ అధికారుల అండతోనే అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.డి.పోచంపల్లి సాయిబాబా కాలనీ,రాజరాజేశ్వరి కాలనీ తో పాటు ప్రతాప్ రెడ్డి కాలనీ,పొచిరెడ్డి కాలనీలలో జి ప్లస్ 2 మున్సిపల్ అనుమతులు పొందిన నిర్మాణదారులు జి ప్లస్ 5 నుండి జి ప్లస్ 6 అంతస్తుల అక్రమనిర్మాణాలు చేపడుతున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది కన్నెత్తి చూడటం లేదు.పూర్తి స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నా వారంలో 3 రోజులు మాత్రమే విధులకు హాజరవుతుండడం,ఉన్న 3 రోజులు సైతం కోర్టు కేసులు అంటూ ఆఫీస్ కి పరిమితం అవుతుండడంతో టౌన్ ప్లానింగ్ కింది స్థాయి సిబ్బంది చెప్పిందే వేదం చేసిందే చట్టం అన్నట్లుగా సాగుతున్నాయి.

పత్తాలేని టాస్క్ ఫోర్స్..

తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం అక్రమనిర్మాణాలను తొలగించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ని నియమించింది.ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తాడు. వారి ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలపై నిఘా పెట్టడం,స్థానిక అధికారుల నుండి అక్రమనిర్మాణాల జాబితా తెప్పించుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాల్సి ఉంటుంది. అక్రమనిర్మాణాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది కన్నెత్తి చూడకపోవడంతోనే మున్సిపల్ సిబ్బంది ఆగడాలు సాగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేతివాటం

దుండిగల్ మున్సిపాలిటీ 9వ వార్డులో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమనిర్మాణాలను గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది,అక్రమనిర్మాణాలపై సమాచారం ఇవ్వకపోగా కాసులకు కక్కుర్తి పడుతున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణ దారులకు సహకరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తిలా పాపం తలా పిరికెడు అన్నట్లుగా స్థానిక కౌన్సిలర్ వ్యవహరిస్తున్నాడదంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అక్రమ నిర్మాణాలపై జిల్లా అధికారులు నిఘా పెట్టాలని డిమాండ్ వినిపిస్తుంది.


Similar News