కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారు : కూకట్పల్లి ఎమ్మెల్యే
హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను పెంచినందుకా
దిశ,కూకట్పల్లి: హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ను పెంచినందుకా, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినందుకా కేటీఆర్‌ను అరెస్ట్ చేయడమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో మంచి బ్రాండ్ ఇమేజ్ తీసుకు వచ్చేందుకు కృషి చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగిందని, అభివృద్దిలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
గతంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపై ఆందోళనలకు దిగే వారని, తాగునీటి కష్టాలను పరిష్కరించిన ఘనత బీఆర్ఎస్, మాజి మంత్రి కేటీఆర్‌దేనని అన్నారు. హైదరాబాద్‌లో 24 గంటల కరెంట్ అందించిన ఘనత కేటీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినందుకా కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తుంది, ఏ తప్పు చేశారని ఏసీబీ విచారణ చేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని, దేశాన్ని ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చేందుకు అంతర్జాతీయ ఈ ఫార్ముల రేసింగ్‌ను నగరంలో నిర్వహించారని, ఈ ఫార్ములా రేసింగ్‌తో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని అన్నారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా రాష్ట్రానికి 7 వందల కోట్ల పై చీలుకు ఆదాయం వచ్చిందని అన్నారు.
కక్ష్య పూరిత ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని అన్నారు. ఈ ఫార్ములా రేసింగ్, రింగ్ రోడ్డు వంకతో కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఈ విషయాలపై అసెంబ్లిలో చర్చ చేయమని స్పీకర్‌ను అడిగాము, అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే లోపే కేసు బుక్ అయినట్టు కాంగ్రెస్ వాళ్లు మీడియాకు లీకులు ఇచ్చి అరెస్ట్ చేస్తున్నామని పుకార్లు సృష్టించారని అన్నారు. ఇదే ధోరణి అవలంబిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడు అండగా ఉంటారని అన్నారు.