మల్కాజ్గిరి మైనారిటీ గురుకుల విద్యార్థినిలకు అస్వస్థత..
జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన 33 మంది
దిశ, ఘట్కేసర్ : జిల్లాలోని మైనారిటీ గురుకుల పాఠశాలకు చెందిన 33 మంది విద్యార్థినులకు ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగి ఆసుపత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే... నాగారం లోని మల్కాజ్గిరి మైనారిటీ గురుకుల పాఠశాలలో గురువారం మధ్యాహ్నం చికెన్ కర్రీతో 450 మంది విద్యార్థినులు భోజనం చేశారు. వారిలో 33 మంది వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండగా పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న, వార్డెన్, సిబ్బంది ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని కమ్యూనిటీ ఆసుపత్రిలో సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో చేర్చారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో అడ్మిట్ చేశారు.
అయితే ఈ విషయాన్ని బయటకు రాకుండా కళాశాల ప్రిన్సిపల్ , వార్డెన్ దాచిపెట్టడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులను, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి విద్యార్థినులను చూడడానికి రాగా పాఠశాల ప్రిన్సిపాల్, వార్డెన్, కొందరు సిబ్బంది విరుచుకుపడ్డారు. మీకేం సంబంధం మీరెవరు అంటూ దురుసుగా ప్రవర్తించారు. అయితే విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని చెప్పినప్పటికీ, చికిత్స పొందుతున్న విద్యార్థినుల వద్ద వారి తల్లిదండ్రులు లేకపోవడం గమనార్హం. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులను ఆరా తీయగా 9 మంది విద్యార్థినుల పరిస్థితి చెప్పలేమని వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, మిగిలిన వారిని హాస్టల్ కు వెళ్ళిపోవచ్చని చెప్పినట్లు వైద్యులు తెలిపారు. కాగా విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి రఘునాథ స్వామి ఆసుపత్రికి వచ్చి వెళ్లినట్టు సమాచారం.