హైడ్రా కన్నెర్ర...ఎర్రకుంట చెరువు స్థలంలో అక్రమ నిర్మాణాలు నేలమట్టం
అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర జేసింది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది.
దిశ, మేడ్చల్ బ్యూరో : అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర జేసింది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస దాడులతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను కూల్చేస్తోంది. పంద్రాగస్టు సెలవు దినాన్ని కూడా లెక్క చేయకుండా బుధవారం అర్దరాత్రి ఒంటి గంట నుంచే యాక్షన్ లోకి దిగింది. మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి సర్వే నెంబరు 134 లో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు బఫర్ జోన్లలో నిర్మించిన బహుళ అంతస్తుల అక్రమ కట్టడాలను అధికార యంత్రాంగం నేలమట్టం చేసింది. అధికారులు పెద్ద మొత్తంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్ మెంట్లను కూల్చివేస్తున్నారు.
పరిశీలించిన తక్షణమే..
ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలపై ఆగస్టు 1వ తేదీన హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఈ నెల 14న (బుధవారం ఉదయం) ఎర్రకుంట చెరువులో వెలిసిన నిర్మాణాలను పరిశీలించారు.
స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అర్ద రాత్రి నుంచే కూల్చివేతలు చేపట్టాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా మూడు బహుళ అంతస్తులను గురువారం మధ్యాహ్నం వరకు నేలమట్టం చేశారు. భారీ భవనం నేలమట్టమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
భయం..భయం..
ఎర్రకుంటతోపాటు నిజాంపేటలోని స్ప్రింగ్ వ్యాలీలోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన విల్లాలను సైతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అదేవిధంగా దుండిగల్ గండి మైసమ్మ మండలంలోని మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస్ కత్వా చెరువును ఆక్రమించి నిర్మించిన విల్లాలను సైతం పరిశీలించారు. పక్కనే సర్వే నెంబర్ 170/6లో తప్పుడు పత్రాలతో హెచ్ఎండీఏ అనుమతులు
తీసుకుని ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ విల్లాల నిర్మాణాలను పరిశీలించారు. ఎర్రకుంట చెరువు స్థలంలో నిర్మించిన అపార్ట్ మెంట్లు, బహుళ అంతస్తులపై శరవేగంగా హైడ్రా కొరడా ఝుళిపించడంతో మిగితా స్ప్రింగ్ వ్యాలీ, మల్లంపేట అక్రమ నిర్మాణదారులు, కొనుగోలుదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. నేడో.. రేపో ఇక్కడి అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయని స్థానికంగా చర్చ నడుస్తోంది.