రంజాన్ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ..
కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను సోదర భావంతో నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
దిశ, కూకట్పల్లి: కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను సోదర భావంతో నిర్వహించుకోవాలని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని కేపీహెచ్‌బీకాలనీలో నూతనంగా నిర్మించిన ఈద్గా ప్రారంభోత్సవ, రంజాన్ వేడుకలలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా ప్రారంభోత్సవ కార్యక్రమ అనంతరం రంజాన్ నమాజ్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ అందరూ సోదర భావంతో కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ సీఎం కేసీఆర్ కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.
రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు రంజాన్ కానుకలను పంపిణీ చేయడంతో పాటు ఇఫ్తార్ విందును అందిస్తున్నారని అన్నారు. కూకట్పల్లి ప్రజలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అండగా ఉండి ఈద్గాను నిర్మించి ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నగరంలో ఎక్కడా లేని విధంగా కేపీహెచ్‌బీకాలనీలో ఈద్గాను నిర్మించి అన్ని వసతులు కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్ రావు, పండాల సతీష్ గౌడ్, జిల్లా మైనారిటి విభాగం అధ్యక్షుడు గౌసుద్దీన్, మాజీ కార్పొరేటర్ బాబురావు, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.