మేడ్చల్ బీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి!
మంత్రి మల్లన్నకు సొంత పార్టీ కౌన్సిలర్లు షాకిచ్చారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో ఐదుగురు ఆధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు కారు దిగి, హస్తం గూటికి చేరారు.
దిశ ప్రతినిధి, మేడ్చల్: మంత్రి మల్లన్నకు సొంత పార్టీ కౌన్సిలర్లు షాకిచ్చారు. ఘట్‌కేసర్ మున్సిపాలిటీలో ఐదుగురు ఆధికార బీఆర్ఎస్ కౌన్సిలర్లు కారు దిగి, హస్తం గూటికి చేరారు. అదే బాటలో మరికొందరు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు నడిచేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ నుంచి వెళ్లేవారంతా మంత్రి తమకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని, అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీంతో మేడ్చల్ బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. రోజు రోజుకు అధికార పార్టీని వీడి నేతలు హస్తం గూటికి వెళ్లడంతో.. కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది.
అసంతృప్తుల హస్తం బాట..
ఎన్నికల వేళ మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇటీవల కాలంలో అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నారు. మంత్రికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు ఇప్పటికే పార్టీని వీడారు. ఈ కోవలోనే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్సీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నక్కా ప్రభాకర్ హస్తం గూటికి చేరారు.
సుధీర్ రెడ్డితోపాటే జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితోపాటు మంత్రి మల్లారెడ్డిపై ఉన్న అసంతృప్తితో పార్టీని వీడి పలువురు తాజా, మాజీ ప్రజాప్రతినిధులు హస్తం గూటికి చేరువవుతున్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్ లో కీలక నేత, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ తో సహా తన కుమార్తె కార్పొరేటర్ నిహారిక గౌడ్ కూడా అధికార పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ జెడ్పీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డిని పార్టీని వీడి, బీఆర్ఎస్ లో చేరకుండా బుజ్జగించడంలో సక్సెస్ అయ్యారు.
ఆరుగురు కౌన్సిలర్లు గుడ్ బై..
ఘట్‌కేసర్ పురపాలికలో బీఆర్ఎస్ పార్టీకి ఆరుగురు కౌన్సిలర్లు రాజీనామా చేసి మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. 3వ వార్డు కౌన్సిలర్ బొక్క సంగీత ప్రభాకర్ రెడ్డి, 6వ వార్డు కౌన్సిలర్ నస్రీన సుల్తానా, 10వ వార్డు బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్, 11వ వార్డు కడుపోల మల్లేశ్, 15వ వార్డు బత్తుల నరేష్ యాదవ్, 18వ వార్డు కౌన్సిలర్ కూతాడి ర వీందర్ హస్తం గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రే ష్ యాదవ్, పార్టీ సీనియర్ నేత నక్కా ప్రభాకర్ ఆరుగురు కౌన్సిలర్లను ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి నిధులు తేవడంలో విఫలమయ్యారని, పాలు, పూలు అమ్మిన మంత్రికి వ్యాపారం మాత్రమే తెలుసని, రాజకీయం రాదని, అయనను ఇంట్లోనే ఉంచాలని, వచ్చే ఎన్నికల్లో మంత్రి ఓటమే లక్ష్యంగా పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.
ఘట్కేసర్ లో.. వరుస దెబ్బలు
మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సొంత మండలం ఘట్కేసర్ లో అధికార పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. గతంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి బీ ఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయన విఫలమయ్యాడు కాబట్టే పార్టీ మారుతున్నట్లు సుదర్శన్ చెప్పారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తన కుమారుడైన ఘట్ కేసర్ జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి పార్టీని వీడారు. మల్లారెడ్డి తమను అధికార పార్టీలో ఉండనీయకుండా.. అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
అక్టోబర్ 18న సీఎం కేసీఆర్ హాజరైన మేడ్చల్, గుండ్ల పోచంపల్లి సభకు మమ్మల్ని ఆహ్వానించలేదని ఆహ్వానించలేదని తీవ్ర మనోవేదనకు గురై. అదే రోజున రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఇదే మండలానికి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా మండలం లో అధికార పార్టీకి చెందిన బలమైన నేతలు ఒక్కొక్కరు పార్టీని వీడుతుండడంతో అధికార పార్టీలో ఆందోళన మొదలైంది.