ఫుల్ జోష్... 31న ఎంజాయ్...
తాగేయ్... తాగి చిందేయ్... అంటూ మేడ్చల్ జిల్లాలో మద్యం ప్రియులు బ్రాండ్ ఏదైనా తాగి తెగ ఎంజాయ్ చేశారు.
దిశ, మేడ్చల్ బ్యూరో : తాగేయ్... తాగి చిందేయ్... అంటూ మేడ్చల్ జిల్లాలో మద్యం ప్రియులు బ్రాండ్ ఏదైనా తాగి తెగ ఎంజాయ్ చేశారు. డిసెంబర్ 31 వేడుకలు పురస్కరించుకొని మేడ్చల్ జిల్లాలో సంవత్సరం చివరి గడియలకు రెండు రోజుల ముందు నుండే భారీగా మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. డిసెంబర్ నెలలో మొదటి మూడు వారాలు సాధారణంగా జరిగిన మద్యం అమ్మకాలు 2025 కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని డిసెంబర్ నెల చివరి వారం మద్యం కిక్కు మొదలై లాస్ట్ రెండు రోజులు మాత్రం 30,31 రోజుల్లో వందల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేయడం రికార్డ్ నెలకొల్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మేడ్చల్, మల్కాజిగిరి జోన్లు ఉండగా మేడ్చల్ జోన్ లో 114 మద్యం షాపులు, 95 బార్లు ఉన్నాయి.
మల్కాజిగిరి జోన్ లో 88 మద్యం దుఖానాలు ఉండగా 112 బార్లు ఉన్నాయి. మేడ్చల్ జోన్ లో డిసెంబర్ నెల మొత్తం రూ. 265 కోట్ల మద్యం వ్యాపారం జరగగా డిసెంబర్ చివరి రెండు రోజులు 30,31 లలో రూ.43 కోట్లు మద్యం అమ్మకాలు జరగడం గమనార్హం. అలాగే మల్కాజిగిరి జోన్ లో డిసెంబర్ నెల మొత్తం రూ.224 కోట్ల మద్యం వ్యాపారం చేయగా 30, 31 తేదీల్లో రూ.42.64 కోట్ల మద్యం వ్యాపారం చేసినట్లు మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్కే. ఫయాజ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఎక్సైజ్ ఆదాయం ఈ సంవత్సరం డిసెంబర్ 28 న రూ.191 కోట్లు, 29న రూ. 51 కోట్లు, 30న రూ.402 కోట్లు, 31న రూ. 282 కోట్లు ఆదాయం వచ్చింది. మొత్తానికి మద్యం ప్రియులు కొత్త సంవత్సరం వేడుకల సందర్బంగా తెగ తాగి ఎంజాయ్ చేశారు.