కంటోన్మెంట్‌లో బోర్ల కుంభకోణం..?

కంటోన్మెంట్‌లో బోర్లు కుంభకోణం కలకలం రేపుతోంది. కాంట్రాక్టర్ హడావిడిగా బోర్లు వేయించడం అనుమానాలకు తావిస్తోంది.

Update: 2024-06-22 07:33 GMT

దిశ, కంటోన్మెంట్ : కంటోన్మెంట్‌లో బోర్లు కుంభకోణం కలకలం రేపుతోంది. కాంట్రాక్టర్ హడావిడిగా బోర్లు వేయించడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే, అధికారుల పర్యవేక్షణ లేకుండానే బోర్లు వేయడం అనార్థాలకు దారితీస్తోంది. కాంట్రాక్టర్ సంస్థ మోసాలను ముందుగానే పసిగట్టి, అరికట్టాల్సిన కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం ఆలస్యంగా మేల్కొంది. వెరసి రూ. కోట్లలో ప్రజాధనానికి గండిపడుతోంది. ఇకపోతే తెలంగాణ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్(టీఎస్ఎస్ టీఈపీ) సంస్థ బోర్ల కాంట్రాక్ట్ పనులు చేపట్టడం ప్రశ్నర్ధకంగా మారింది.

నిధులున్నా.. నిష్ప్రయోజనం

నీటి కొరతను తీర్చేందుకు సాధారణంగా వేసవిలో బోరు బావులను తవ్విస్తారు. కానీ కంటోన్మెంట్ లో మాత్రం వర్షకాలంలో కాంట్రాక్టర్ జోరుగా బోర్లను వేయిస్తున్నారు. కారణమేమంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే దివంగత సాయన్న మూడేళ్ల నాటి నిధులు మురిగిపోతున్నాయని, వాటిని ఎలాగోల ఖర్చు చేయాలని కాంట్రాక్టర్ హడావిడి చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో బోరు వేసేందుకు దాదాపు రూ. 6 లక్షలు ఖర్చువుతుండగా... వేసవి కాలంలోనే బోర్లు వేసి ఉంటే కంటోన్మెంట్ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు బోర్లు వేసినా నిష్ర్పయోజనమేనని, బోర్లను తక్కువ లోతు వేసి నిధులను దండుకోవడమే లక్ష్యంగా కాంట్రాక్టర్ వ్యవహారిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇకపోతే కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎన్వోసీ తీసుకోకుండానే రోడ్ల మధ్యలో, కొత్తగా నిర్మించిన సీసీ, బీటీ రోడ్లపైన, సీవరేజీ పైపులైన్లను డ్యామేజ్ చేస్తూ.. డిఫెన్స్, కంటోన్మెంట్, ఏ1 భూముల్లో కాంట్రాక్టర్ బోర్లను వేసినట్లు తెలిసింది. అక్కడ నీటి లభ్యత ఉంటుందా..? విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు వీలవుతుందా.. ? అనే అంశాలను సైతం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం.

కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఝలక్..

స్వామి భక్తిని చాటుకునేందుకు కాంట్రాక్టర్, ఇటీవల కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన సాయన్న కుమార్తె నివేదితతో బోర్లకు శంకుస్థాపనలు చేయించడం వివాదానికి దారి తీసింది. కాంట్రాక్టర్ తీరుపై స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ నారాయణన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసే బోర్లకు ప్రొటోకాల్ పాటించరా..? స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించరా..? అని మండిపడ్డారు. దీంతో కాంట్రాక్టర్ ఎమ్మెల్యేతో శంకుస్థాపనలు చేయించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయినా సొంత నిధులతో వేసుకునే బోర్లలో పది కాలలపాటు నీళ్లు వస్తుంటే... ప్రభుత్వ నిధులతో కాంట్రాక్టర్లు వేసే బోర్లు కొన్ని నెలల్లోనే ఎండిపోవడం వెనుక మతలబు ఏమిటని ఎమ్మెల్యే, కాంట్రాక్టర్ ను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.

బోరు వేసే.. నీటి పైపులైన్ పగిలే..

కంటోన్మెంట్ నాల్గవ వార్డులోని లక్ష్మీనగర్‌లో ఈ నెల 19న మంచినీటి పైపులైన్ పై బోరు వేయడం గమనార్హం. దీంతో ఆ పైపులైన్ పగిలిపోయింది. మరుసటి రోజు బస్తీకి పైపులైన్ ద్వారా కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది నీటిని విడుదల చేయగా, కొత్తగా వేసిన బోరులోకి నీరు వెళ్లుతోంది. బస్తీ వాసులకు నీళ్లు రాకపోవడంతో.. కంటోన్మెంట్ సిబ్బందికి తెలియజేశారు. దీంతో బోర్డు సిబ్బంది ఆరా తీయగా, కొత్తగా వేసిన బోరు వల్ల మంచినీటి పైపులైన్ పగిలిపోయిందని, అందులోకి పైపులైన్ ద్వారా విడుదల చేసిన నీళ్లు వెళ్లుతున్నాయని గ్రహించారు. ఈ విషయాన్ని సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో తేరుకున్న కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగం ఆగమేఘాల మీద తెలంగాణ సొసైటీ ఫర్ ట్రెయినింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్ చైర్మన్‌కు, హైదరాబాద్ కలెక్టర్‌తో పాటు జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారికి లేఖలు రాసినట్లు తెలిసింది. టీఎస్ఎస్ టీఈపీ సంస్థ ద్వారా కంటోన్మెంట్‌లో 2020 సంవత్సరం నుంచి వేసిన బోర్లు ఎన్నో లెక్క కావాలని కోరినట్లు సమాచారం. అదేవిధంగా బోర్డు నుంచి ఎన్వోసీ తీసుకోకుండానే బోర్లు వేయడం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, బోర్లపై వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీనిపై హైదరాబాద్ జిల్లా కలెక్టర్, టీఎస్ఎస్ టీఈపీ చైర్మన్ ఏలా స్పందిస్తారో..? వేచి చూడాలి..!


Similar News