బడా బిల్డర్ బరితెగింపు…ప్రభుత్వ స్థలంలో దర్జాగా సీసీ రోడ్డు
అక్రమార్కుల చేతుల్లో ప్రభుత్వ స్థలాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి.
దిశ, దుండిగల్ : అక్రమార్కుల చేతుల్లో ప్రభుత్వ స్థలాలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు అడ్డుకోవాల్సింది పోయి అక్రమార్కులకు పరోక్షంగా సహకరించడంతోనే ప్రభుత్వ స్థలాలు కనుమరుగవుతున్నాయంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దుండిగల్ మున్సిపాలిటీ సారేగుడెం లోని సర్వే నంబర్ 200,200/1లో రెండు ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. గ్రేవ్ యార్డ్ కోసం ప్రభుత్వం కేటాయించింది. ఓ బడా నిర్మాణ సంస్థకు సరైన అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో ప్రభుత్వ స్థలం పై కన్ను పడింది.
అధికారులను, ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని అడ్డదారిలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి సొంత నిధులతో 40 ఫీట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే సగం సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు ఆదివారం అడ్డుకొని ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వ హైడ్రా పేరుతో కుంటలు, చెరువుల పరిరక్షణ తో పాటు ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తుంటే కొందరి అవినీతి అధికారుల చేష్టలతో ప్రభుత్వ, ప్రజాప్రయోజన స్థలాలు అన్యాక్రాంతం అవుతుండడం ఆందోళన కలిగించే విషయమని మేథావులు చర్చించుకుంటున్నారు.
పడిగ సముద్రం కుంట గ్రేవీ యార్డును ఆక్రమించి సీసీ రోడ్డు నిర్మాణం
డి.పి పల్లిలోని లేక్ ఐడి 2870 పడిగ సముద్రం కుంట విస్తీర్ణం 6.846 ఎకరాలు,సారేగుడెం గ్రేవ్ యార్డ్ 2 ఎకరాలకు పైగా ఉంటుంది. కోట్ల విలువ చేసే మూడు ఎకరాల భూమిని ఆక్రమించి సొంత నిధులతో త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్న మూడు శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో ఆదివారం గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
వివాదాలకు కేరాఫ్ గా త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ
దుండిగల్ మున్సిపాలిటీ లో 10 సంవత్సరాల క్రితం నిర్మాణాలు మొదలుపెట్టిన త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ తరచు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. త్రిపుర ల్యాండ్ మార్క్- 2 లో అప్పటి ప్రజాప్రతినిధులు,అధికారుల అండతో బౌరంపేట పెద్ద చెరువు కరకట్ట బఫర్ జోన్ ను ఆక్రమించి 20 విల్లాలు నిర్మించడంతో అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. త్రిపుర ల్యాండ్ మార్క్-3లో సైతం కోమటి కుంట ను ఆక్రమించి విల్లాలు నిర్మిస్తుండంతో ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. త్రిపురల్యాండ్ మార్క్-5లో రోడ్డు కోసం తక్కువ ధరలో భూమిని కొట్టేసేందుకు ఓ భూ యజమానిని బెదిరించి దాడికి యత్నించడంతో త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణదారుడు పసుపులేటి సుధాకర్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. అయినా అతని తీరు మారడం లేదు. నిజాంపేట కు చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్ అండతోనే బరుతెగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అడ్డుకున్న గ్రామస్తులు
సారేగుడెం గ్రేవ్ యార్డ్ తోపాటు, పడిగసముద్రం కుంటను ఆక్రమించి త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ 40 ఫీట్ రోడ్డు నిర్మాణం చేపడుతుండడంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు సీసీ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొని ఆందోళనకు దిగారు. స్థానిక కౌన్సిలర్ రాము గౌడ్ ను వివరణ కోరగా గ్రేవ్ యార్డ్ లో సీసీ రోడ్డు నిర్మాణం చేపడితే సహించేది లేదన్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
మున్సిపాలిటీ నుండి అనుమతి లేదు
త్రిపుర ల్యాండ్ మార్క్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న సీసీ రోడ్డు పై దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ రావు ను దిశ ప్రతినిధి వివరణ కోరగా సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ నుండి ఎటువంటి అనుమతి లేదని,మున్సిపల్ నిధులు కేటాయించలేదన్నారు, అనుమతిలేకుండా నిర్మిస్తున్న సీసీ రోడ్డును తొలగిస్తామన్నారు.
ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు...తహసీల్దార్
సారే గూడెం గ్రేవ్ యార్డ్, పడిగసముద్రంకుంటను ఆక్రమించి ఓ నిర్మాణ సంస్థ సీసీ రోడ్డును నిర్మిస్తున్నట్లు సమాచారం ఉందని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమంచి అనుమతి లేకుండా సీసీ రోడ్డు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దుండిగల్ మండల తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతిన్ తెలిపారు.