అమాయకులపై బాచుపల్లి పోలీసుల జులుం

అమాయకులపై బాచుపల్లి పోలీసులు ప్రతాపం చూపుతున్నారనే విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఉన్నతధికారుల ఒత్తిడి ఉంటే చాలు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు.

Update: 2024-07-02 16:28 GMT

దిశ, కుత్బుల్లాపూర్ : అమాయకులపై బాచుపల్లి పోలీసులు ప్రతాపం చూపుతున్నారనే విమర్శలు చుట్టుముడుతున్నాయి. ఉన్నతధికారుల ఒత్తిడి ఉంటే చాలు లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. ఒక్క రోజు ఇంట్లో పనికి వెళ్లిన పాపానికి ఓ మహిళను చిత్రహింసలు పెట్టి మరీ దొంగతనం చేసినట్లు ఒప్పుకో లేకుంటే జైలుకు పంపుతాం అంటూ బెదిరించి, తీవ్రంగా కొట్టి బలవంతంగా చేయని నేరం ఒప్పించడంతో ఆ కుటుంబం లోని ఓ వ్యక్తి మంగళవారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం...ఆంధ్రప్రదేశ్ కీ చెందిన లక్ష్మీ, తాతారావు భార్య భర్తలు.బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో కొన్నేళ్ల క్రితం నుండి నివసిస్తున్నారు.

లక్ష్మీ భర్త జయదీపికా ఎస్టేట్ లోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ పనిచేస్తుండగా లక్ష్మి స్థానికంగా ఉన్న అపార్ట్మెంట్ ల లో ఇళ్లలో పనికి వెళ్తుంది. అయితే గత నెల 16 న లక్ష్మి ఎన్ డీ 4 అపార్ట్మెంట్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో గల ఇంటి యజమాని రిక్వెస్ట్ తో ఒక్క రోజు మాత్రమే పనికి వెళ్ళింది. అయితే 18 వ తేది రోజు గ్రౌండ్ ఫ్లోర్ యజమాని నా ఇంట్లో బంగారు ఆభరణాలు పోయాయి.నాకు ఒక్కరోజు మా ఇంట్లో పనికి వచ్చిన లక్ష్మి పై అనుమానం ఉందని బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఫిర్యాదు దారుడికి పోలీస్ ఉన్నతధికారుల పరిచయాలు ఉండడంతో 19 వ తేదీ నుండి నిత్యం లక్ష్మి ఆమె కుటుంబ సభ్యులని బాచుపల్లి పోలీస్ స్టేషన్ కీ సీఐ ఉపేందర్, ఎస్ ఐ చంద్ర శేఖర్ రప్పిస్తూ బెదిరింపులకు దిగారు. దొంగతనం చేసినట్లు ఒప్పుకోవాలని, బంగారు చైన్ తెచ్చి ఇవ్వాలని మానసికంగా, శారీరకంగా తీవ్రంగా పోలీసులు వేధించారు.

ఏదో ఒక చైన్ తీసుకురా నీ కేసు క్లోజ్ అవుతాది లేదంటే నిన్ను, నీ కుటుంబాన్ని జైలుకు పంపుతాము అంటూ తీవ్రంగా హెచ్చరించారు.పోలీసుల దెబ్బలు, మానసిక ఒత్తిడి తట్టుకోలేక లక్ష్మి చేయని నేరం ఒప్పుకుంది. ఆ చైన్ మా బాబాయ్ రాజేష్ వద్ద ఉందని తెలిపి తీసుకువస్తా సార్ నన్ను వదిలేయండి అని వేడుకుంది. ఏదోలా పోలీసుల బాధ నుండి తప్పించుకుందామని భావించిన లక్ష్మీ తన బాబాయ్ వద్ద ఉన్న బంగారు చైన్ ను పోలీసులు తీసుకుని వారిని తిరిగి పోలీస్ స్టేషన్ కీ రమ్మని బెదిరించారు. ఫిర్యాదు దారుడికి లక్ష్మి బాబాయ్ వద్ద నుండి బలవంతంగా తెచ్చిన గోల్డ్ చైన్ ఇచ్చి కేసు క్లోజ్ చేద్దామని చూసినట్లు బాధితులు తెలుపుతున్నారు.

ఆ తర్వాత పోలీస్ లు లక్ష్మి బాబాయ్ రాజేష్ వద్ద నుండి తీసుకువచ్చిన ఆ చైన్ తన ఇంట్లో పోయిన చైన్ కాదని ఫిర్యాదు దారుడు పోలీస్ లకు తెలపడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. బాచుపల్లి పోలీసులు లు సీఐ ఉపేందర్, ఎస్ ఐ రమేష్ ఆదేశాలతో మళ్ళీ లక్ష్మి,తన బాబాయ్ రాజేష్ ను పోలీస్ స్టేషన్ కీ రప్పించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న క్రమంలో పోలీసులు రాజేష్ పోలీస్ ల బెదిరింపులకు భయపడి బాచుపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇది గమనించిన పోలీసులు చికిత్స నిమిత్తం రాజేష్ ను హుటాహుటిన బాచుపల్లి లో గల ఎస్ ఎల్ జీ హాస్పిటల్ కు తరలించారు.

రాజేష్ పరిస్థితి క్రిటికల్ గా ఉందని అత్యవసర చికిత్స చేయకపోతే మనిషి ప్రాణానికి ప్రమాదం ఉందని రోజుకు 45 వేల రూపాయలు ఖర్చు అవుతాయని ఎస్ ఎల్ జీ హాస్పిటల్ యాజమాన్యం బాధితులకు తెలిపారు. మా వద్ద అంత స్థోమత లేదని తెలపడంతో మేము వేరే హాస్పిటల్ కు వెళ్తామని అనడం తో బాచుపల్లి సీఐ ఆ బిల్లు నేను చెల్లిస్తా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి మమ్మల్ని బయటికి రానీయకుండా, విషయం బయటికి పొక్కకుండా సీఐ జాగ్రత్త పడినట్లు బాధితులు తెలిపారు. జరిగిన సంఘటన పట్ల కంగుతిన్న పోలీసులు మా చైన్ మాకు ఇచ్చి మాతో రాజీకీ ప్రయత్నించినట్లు బాధితులు తెలిపారు.

ఫిర్యాదుదారుడికీ న్యాయం చేసేందుకే విచారణ చేపట్టాం...

లక్ష్మినీ మహిళా పోలీసులు విచారించారు...

చిత్రహింసలకు గురి చేయలేదు...

బాచుపల్లి సీఐ ఉపేందర్

పథన్ మహబూబ్ జానీ అనే వ్యక్తి తన ఇంట్లో 19 జూన్ నాడు దొంగతనం జరిగినది అని బాచుపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు లో ఒక బంగారు చైన్, ఒక బంగారు నెక్లస్, ఒక జత బంగారు చెవి కమ్మలు పోయాయాని వాటి బరువు 5 తులాల ఉందని ఫిర్యాదు లో పేర్కొన్నాడు.జూన్ 16 న ఇంట్లో దొంగతనం జరిగినదని మా ఇంట్లో పనికి వచ్చిన చిత్తారపు లక్ష్మి అనే మహిళపై అనుమానం ఉందని ఫిర్యాదు దారుడు తెలిపాడు.లక్ష్మీనీ మహిళ పోలీసులతో విచారణ చేయగా తాను చేసినట్లు ఒప్పుకుని బంగారు చైన్ ను ఆమె ఆడ పడచు భర్త రాజేష్ కు ఇచ్చినట్లు ఒప్పుకుంది. రాజేష్ ను ఫిర్యాదు ఇచ్చినప్పటి నుంచి నేటి వరకు పోలీస్ స్టేషన్ కు పిలవలేదు. లక్ష్మినీ కేవలం మహిళా పోలీసుల చేత మాత్రమే విచారణ చేయించాం, చిత్రహింసలకు గురి చేయలేదు.

Similar News