విలీన పంచాయతీలన్నీ ఇకపై వార్డు కార్యాలయాలు ..

ఘట్కేసర్ మున్సిపాలిటీ , పోచారం మున్సిపాలిటీలలో ఇటీవల

Update: 2024-09-10 11:03 GMT

దిశ, ఘట్కేసర్: ఘట్కేసర్ మున్సిపాలిటీ , పోచారం మున్సిపాలిటీలలో ఇటీవల విలీనమైన గ్రామ పంచాయతీలన్నీ వార్డు కార్యాలయాలు అయ్యాయి. ఇటీవల గ్రామపంచాయతీల పరిపాలన కాలం పూర్తయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు పంచాయతీ పరిపాలన నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసి ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఘట్కేసర్ మండల పరిధిలోని అవుషాపూర్, అంకుషాపూర్, మాదారం, ఎదులాబాద్ మరిపల్లిగూడా వార్డు కార్యాలయాలను ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్, కమిషనర్ సాబేర్ అలీ, కౌన్సిలర్లు సందర్శించగా, పోచారం మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన కాచివానిసింగారం, ప్రతాప సింగారం, కొర్రెముల, వెంకటాపూర్, చౌదరిగుడా గ్రామాలను పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, కమిషనర్ వీరారెడ్డిలు సందర్శించారు.

ఘట్కేసర్ మున్సిపాలిటీలో విలీన గ్రామాల చార్జీలను ఎంపీఓ రవికుమార్ మున్సిపల్ కమిషనర్ సాబేర్ అలీకి అప్పగించగా, స్పెషల్ ఆఫీసర్ నారాయణరావు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి సమక్షంలో పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డికి ఆయా పంచాయతీల కార్యదర్శులు ఛార్జ్ అప్పగించారు. అనంతరం వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. ఇకపై విలీన గ్రామాల్లో మున్సిపల్ చట్టం ప్రకారం పన్నులు వసూలు చేయబడతాయని, పారిశుద్ధ్య కార్మికులకు జీతభత్యాలు కూడా పెరుగుతాయని తెలిపారు. వార్డుల అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు.


Similar News