బీఆర్​ఎస్​కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే : బండి రమేష్​..

మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్​ పార్టీ ఆది నుంచే కట్టుబడి ఉందని మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, కవి ఇమ్రాన్​ ప్రతాప్​ఘరి అన్నారు.

Update: 2023-11-10 05:04 GMT

దిశ, కూకట్​పల్లి : మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్​ పార్టీ ఆది నుంచే కట్టుబడి ఉందని మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, కవి ఇమ్రాన్​ ప్రతాప్​ఘరి అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి బండి రమేష్​కు మద్దతుగా అల్లాపూర్​ డివిజన్​లో 5 వేల మంది మైనారిటీలతో నిర్వహించిన సభకు కాంగ్రెస్​ పార్టీ మహారాష్ట్ర రాజ్యసభ సభ్యుడు, కవి ఇమ్రాన్​ ప్రతాప్​ఘరి, కర్ణాటక శివాజినగర్​ ఎమ్మెల్యే రిజ్వాన్​ అర్శద్​లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇమ్రాన్​ మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావం నుంచి మైనారీటిలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడిందని అన్నారు. కాంగ్రెస్​ పార్టీ 4 వేల కోట్ల బడ్జెట్​తో మైనారిటి డిక్లరేషన్​ను ప్రకటించిన ఘనత, ధైర్యం కేవలం కాంగ్రెస్​ పార్టీ చేసిందని అన్నారు. అదే విధంగా ఇమ్రాన్​ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మొహబ్బత్​ భాయి చారేకే దివానే దిన్​ హి లౌటాదో.. వో సస్తి దాల్​, సబ్జికే సుహానే దిన్​ హి లౌటాదో.. ఏ అచ్చే దిన్​ తో అంబాని, అదానికో ముబారక్​ హో.. హమే అయిసా కరో సాహెబ్​ పురానే దిన్​ హి లౌటాదో.. అంటు తన గానంతో అందరిని ఆకట్టుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే రిజ్వాన్​ మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ ఎల్లప్పుడు మైనారిటీల పక్షాన ఉందని, కాంగ్రెస్​ పార్టీ మైనారిటీలు తమ ఓటుతో ఆశీర్వదించాల్సిన అవసరం ఉందని అన్నారు. అనంతరం అభ్యర్థి బండి రమేష్​ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పని చేసే పార్టీ దేశంలో ఏకైక పార్టీ అది కాంగ్రెస్​ పార్టీయేనని అన్నారు. బీఆర్​ఎస్​ పార్టీ, బీజేపీ పార్టీకి బీ టీం అని అన్నారు. ఎమ్మెల్సీ కవితను లిక్కర్​ కేసులో కేంద్ర ప్రభుత్వం అరెస్ట్​ ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్​ చేశారు. బీఆర్​ఎస్​ పార్టీకి ఓటు వేస్తే అది బీజేపీ ఖాతాలో పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్​పల్లి ఎన్నికల ఇన్​చార్జి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం, మైనారిటి నాయకులు ఎండి. మోయిజ్​ తదితరులు పాల్గొన్నారు.

అల్లాపూర్​లోని కర్ణాటక ముస్లింలే టార్గెట్​..

తెలంగాణ రాష్ట్రంలో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభావం అది ముఖ్యంగా కూకట్​పల్లి ప్రాంతంలో ఉంటుంది. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్​, మూసాపేట్​ ప్రాంతాలలో అత్యధికంగా కర్ణాకట రాష్ట్రానికి చెందిన వారు, ముఖ్యంగా బీదర్​ పరిసర ప్రాంతాలకు చెంది వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో మైనారిటీలు ఏకతాటి పై కర్ణటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి భారి మెజారిటితో అందించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల పై పడింది. ఒక్కసారిగా తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ పుంజుకోవడం, పార్టీలో ఎన్నికలలో పోటీ చేసేందుకే అభ్యర్థుల మధ్య పోటీ పెరగడం తెలిసిందే.

ఈ క్రమంలో కూకట్​పల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్న కర్ణాటక ప్రాంత వాసుల ఓట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్​ పార్టీ కర్ణాటక ఎమ్మెల్యేలు, మైనారిటి నాయకులను ఎన్నికల ప్రచారంలో భాగస్వాములు చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా మైనారిటి ఓట్లు ప్రాంతంలో అల్లాపూర్​, ఓల్డ్​ బోయిన్​పల్లి డివిజన్​లు ప్రధానంగా ఉంటాయి. ఈ ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే విధంగా ఉంటాయనే అనవచ్చు. అల్లాపూర్​ డివిజన్​ మైనారిటీలు వేలాది సంఖ్యలో సభలో పాల్గొనడం, సభ విజయవంతం కావడం బీఆర్​ఎస్​ పార్టీని కలవరపెడుతుందనే చర్చ జరుగుతుంది.

Tags:    

Similar News