అందోలులో నేటీ నుంచి జోనల్ గేమ్స్...
అందోలులోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికల 10వ జోనల్ లేవల్ పోటీలు నేటీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
దిశ, అందోల్: అందోలులోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో బాలికల 10వ జోనల్ లేవల్ పోటీలు నేటీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో జోనల్ పరిధిలోని 10 గురుకుల పాఠశాలల్లోని బాలికలు పాల్గొనగా, ఇప్పటికే దాదాపుగా ఆయా పాఠశాలల పరిధిలోని క్రీడాకారులు ఆదివారం సాయంత్రం నాటికి అందోలు గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. క్రీడాకారులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురుకుల పాఠశాల ప్రాంగణంలోని మైదానాన్ని గత వారం రోజుల నుంచి చదును చేసి క్రీడలకు అనుకూలంగా మైదానాన్ని సిద్ధం చేశారు.
హైద్రాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన చిట్కుల్, ఇస్నాపూర్, జహీరాబాద్, అందోలు, రాయికోడ్, వికారాబాద్, కోకపేట్, మోమిన్‌పేట్, బత్వారం, ఆర్‌కే పురం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన బాలికలు ఈ పోటీల్లో పాల్గొంటారు. టెన్త్ జోనల్ మీట్‌లో వాలీబాల్, బాల్ బాడ్మింటన్, కబడ్డీ, హ్యండ్‌బాల్, ఖోఖో, టెన్నికైట్, చెస్, క్యారం పోటీలను నిర్వహిస్తుండగా, అండర్ 14,17,19 బాలికలు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొననున్నారు. పాఠశాల ఆవరణలోని క్రీడా మైదానంలో వివిధ పోటీలకు సంబంధించిన కోర్టులను పీఈటీ, పీడీల సహకారంతో సిద్ధం చేశారు. పది గురుకుల పాఠశాలల నుంచి సుమారుగా 850 మంది వరకు విద్యార్ధినిలు పాల్గొనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది చేస్తున్నారు.
క్రీడలను ప్రారంభించనున్న మంత్రి దామోదర్
అందోలులోని గురుకుల పాఠశాలలో జరుగనున్న 10వ జోనల్ లేవల్ పోటీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. మంత్రితో పాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్‌పీ రూపేష్‌లతో పాటు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల అధికారులు, అధ్యాపకులు హాజరు కానున్నారు.