Court decision : మీరు బీసీ..కాదు ఓసీ...వెంటనే పదవిలో నుంచి దిగిపో...
మున్సిపల్ ఎన్నికల్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ కు న్యాయస్థానం షాక్ ఇచ్చింది.
దిశ, గుమ్మడిదల : మున్సిపల్ ఎన్నికల్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్ కు న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధి బీసీనని తప్పుడు పత్రాన్ని సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడాన్ని తప్పు పట్టింది. తప్పుడు పత్రాలతో నాలుగున్నరేండ్లు పదవిలో కొనసాగిన ఆ ప్రజాప్రతినిధిపై వేటు వేయాలని సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. బొల్లారం మున్సిపల్ పరిధిలో 2020 లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికలలో 10వ వార్డ్ బీసీ జనరల్ కు కేటాయించారు. అయితే ఈ వార్డు నుంచి బోరం శైలజ అనే మహిళ బీసీ కుల ధ్రువపత్రంతో పోటీ చేసి తమ ప్రత్యర్థి నరసింహ రాజు పై గెలుపొందారు. కాగా శైలజ బీసీ వర్గానికి చెందిన మహిళ కాదని, ఓసీ వర్గానికి చెందిన
శైలజ చౌదరిగా గుర్తించిన ప్రత్యర్థి నరసింహరాజు పూర్తి ఆధారాలతో సంగారెడ్డి జిల్లా కోర్టుని ఆశ్రయించారు. రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వ్యక్తి తప్పుడు కుల ధ్రువపత్రంతో ఎన్నిక కావడన్ని న్యాయ మూర్తి తప్పు పట్టారు. వెంటనే కౌన్సిలర్ శైలజను పదవి నుంచి తొలగిస్తూ ఆమె ప్రత్యర్థి నరసింహరాజుని కౌన్సిలర్ గా ప్రకటించాలని తీర్పు వెలువరించింది. ఇప్పటికే శైలజ కౌన్సిలర్ గా నాలుగున్నర సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేశారు. శైలజ ఎన్నికను సవాలు చేస్తూ న్యాయపోరాటం చేసిన ప్రత్యర్థి నరసింహారాజు కోర్టు ఉత్తర్వు కాపీలను
జిల్లా అడిషనల్ కలెక్టర్ కి సమర్పించారు. శుక్రవారం బొల్లారం మున్సిపాలిటీకి చెందిన తోటి కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులతో కలిసి కోర్టు తీర్పును అమలు పరుస్తూ శైలజను కౌన్సిలర్ గా తొలగించి తనను డిక్లేర్ చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వులను పరిశీలించి నిపుణుల సలహా తీసుకొని నిర్ణయం తీసుకుంటానని అడిషనల్ కలెక్టర్ నరసింహారాజుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ గోపాలమ్మ, లక్ష్మా రెడ్డి, మహేందర్ రెడ్డి, నర్సింహారాజు, రాజ్ గోపాల్, వెంకటయ్య, వి.ప్రవీణ్ రెడ్డి, బషీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.