యోగాతో 80శాతం రోగాలు నయం: మంత్రి తన్నీరు హరీష్ రావు
యోగా, ప్రాణాయామంతో 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు.
దిశ, సిద్దిపేట ప్రతినిధి: యోగా, ప్రాణాయామంతో 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో "వ్యాస మహర్షి యోగ - యూ ట్యూబ్ లింకు లోగో"ను మంత్రి హరీష్ రావు అవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమెరికా, యూరప్ దేశాల వారు మన యోగాను అభ్యసించి జీవన శైలిలో భాగంగా మార్చుకుంటున్నారని తెలిపారు. కుటుంబంలోని పిల్లలు పెద్దలు ప్రతి రోజూ ఉదయం ఆర గంట యోగా చేయడంతో చాలా రకాల వ్యాధులు దరి చేరవన్నారు.
రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలోని ఏంబీబీఎస్ విద్యార్థులచే నిత్యం యోగా చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా నా దినచర్య యోగతోనే ప్రారంభమవుతుందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమం చేపట్టినట్లు మహిళలు వివిధ వ్యాధులతో బాధపడుతున్న దృష్ట్యా వారి కోసం ప్రత్యేకించి వారి కోసం వైద్య ఆసుపత్రులు ఏర్పాటు చేశామని తెలిపారు.
అదేవిధంగా ప్రతి మంగళవారం ఈ వైద్య సేవలు, పరీక్షలు చేసి, అవసరమైతే మెడికల్ కళాశాలలకు పంపించి అవసరమైన పెద్ద వైద్యం అందిస్తామని భరోసానిచ్చారు. సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని బస్తీ దవాఖానలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా ఉచిత వైద్య సేవలు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయిని తరుణి, మహిళా అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పరామర్శ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వెంగళ రాంచంద్రం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. పట్టణంలోని గణేష్ నగర్ లోని వెంగళ రాంచంద్రం కుటుంబ సభ్యులను మంత్రి హరీష్ రావు పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.