వడక్పల్లిని ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతాం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
అమీన్పూర్ మండల పరిధిలోని వడక్పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
దిశ, అమీన్ పూర్ : అమీన్పూర్ మండల పరిధిలోని వడక్పల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమానికి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 40 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన మినీ ఫంక్షన్ హాల్, 10 లక్షల రూపాయలతో బతుకమ్మ ఘాట్, 10 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 70 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, 35 లక్షల రూపాయలతో చేపట్టిన అంతర్గత మురుగునీటి కాలువలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు కోట్ల రూపాయలతో వడకపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళుతున్నామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, నిధులు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకతతో పనులు చేపడుతున్నామన్నారు.
తదనంతరం గ్రామంలో నిర్మించనున్న రామాలయం దేవాలయం భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రామాలయం నిర్మాణానికి తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. పటాన్చెరు కార్పొరేటర్ 10 లక్షల రూపాయలు, గ్రామ సర్పంచ్ 10 లక్షల రూపాయలు, ప్రముఖ వ్యాపారి సీసాల రాజు 10 లక్షల రూపాయల విరాళాలను ప్రకటించారు. అనంతరం సుల్తాన్పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మల్లికార్జునస్వామి దేవాలయంకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, గ్రామ సర్పంచులు లలితా మల్లేష్, నరసమ్మ, ఎంపీడీఓ మల్లీశ్వర్, వైస్ ఎంపీపీ సునీత సత్యనారాయణ, వివిధ గ్రామాల సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.