పార్టీ బలోపేతానికి రెట్టించిన ఉత్సాహంతో కృషి చేయాలి : ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి

పార్టీ బలోపేతానికి రెట్టించిన ఉత్సాహంతో కృషి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Update: 2023-04-25 12:49 GMT

దిశ, దుబ్బాక: పార్టీ బలోపేతానికి రెట్టించిన ఉత్సాహంతో కృషి చేయాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని రజినీకర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం మెదక్ ఎంపీ, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ప్రతినిధుల సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధులుగా ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, రాష్ట్ర గిడ్డంగిల చైర్మెన్ సాయి చంద్, మాజీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వేంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ తల్లి, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి, స్థానిక బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ ప్రభాకార్ రెడ్డి మాట్లాడుతూ... స్వరాష్ట్ర సాధన కోసం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రాణాలకు తెగించి శాంతియుత పోరాటం ద్వారా లక్ష్యాన్ని సాధించారని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో మళ్లీ పరాయి పార్టీల ప్రతినిధులు తెలంగాణ ప్రజలకు వాటి ఫలాలు అందకుండా చేయాలని, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాయన్నారు.

రైతు సంక్షేమం, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, పంటలకు సాగునీరు, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందన్నారు. దేశంలో రైతాంగ వ్యతిరేక పార్టీ బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఈ సారి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి, ప్రతి కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్నారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు రఘునందన్ రావును నమ్మి మోపోసపోయారని అన్నారు.

మాయమాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ ను ఇక నమ్మొద్దన్నారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ అభివృద్ధి అంశాలు, కేంద్రం వివక్షపై పది తీర్మానాలు ప్రవేశ పెట్టారు. అనంతరం ఆట, పాటతో అలరించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, గాయకుడు సాయిచంద్ ను ఎంపీ ప్రభాకర్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News