వన దుర్గమ్మ చెంత తగ్గని ఉధృతి..రెండో రోజూ జల దిగ్బంధంలో..

దేశంలోనే రెండో వన దుర్గామాత ఆలయం, జనమేజయుని

Update: 2024-09-02 08:07 GMT

దిశ, పాపన్నపేట : దేశంలోనే రెండో వన దుర్గామాత ఆలయం, జనమేజయుని సర్పయాగం స్థలిగా వినుతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం రెండో రోజు సైతం జల దిగ్బంధంలోనే ఉంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట నిండడం తో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. పటాన్ చెరువు సమీపంలోని నక్క వాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి నీరు దిగువకు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వన దుర్గామాత ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది.

ఆలయ సిబ్బంది, అర్చకులు వనదుర్గమాత ప్రధాన ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం తాత్కాలికంగా మూసివేసి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం లో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులకు వనదుర్గా మాత దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏడుపాయలకు విచ్చేసిన భక్తులు రాజగోపురం లోని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టగానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని వారు తెలిపారు.


Similar News