బీఆర్ఎస్‌కు ఊహించని ఎదురుదెబ్బ.. పటాన్ చెరులో ‘కారు’ బేజారు

రెండు రోజుల క్రితం వరకు కళకళలాడిన కారు పార్టీ ఒక్కసారిగా కకావికలం అయ్యింది.

Update: 2024-07-17 02:01 GMT

దిశ, సంగారెడ్డి బ్యూరో : రెండు రోజుల క్రితం వరకు కళకళలాడిన కారు పార్టీ ఒక్కసారిగా కకావికలం అయ్యింది. బలమైన క్యాడర్ తో ఆ పార్టీ కోలుకోలేని స్థితికి చేరింది. మినీ ఇండియాగా పేరు పొందిన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సెగ్మెంట్ లో బీఆర్ఎస్ దయనీయ పరిస్థితిని ఎదర్కొంటున్నది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు గాలి అనిల్ కుమార్, అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, జీహెచ్ఎంసీ కార్పోరేటర్ పుష్పనగేశ్​యాదవ్, జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ ప్రభాకర్ ఇతర ముఖ్య నేతలంతా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా మరోవారం రోజుల్లో నియోజకవర్గ స్థాయిలోని మిగతా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు.

‘గూడెం’ చేరికతో ఊహించని షాక్...

పటాన్ చెరు సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడతారని ఎవరూ ఊహించలేదు. మాజీ మంత్రి హరీష్ రావుతో అత్యంత సన్నిహితంగా ఉండే గూడెం ఆయనను వదిలి వెళ్లబోరని ప్రచారం జరిగింది. అక్రమ అస్తుల విషయంలో ఈడీ దాడుల జరిగిన సందర్భంలో కూడా హరీష్ రావు మహిపాల్ రెడ్డికి అండగా నిలబడ్డారు. అయితే కేసులు, ఇతర అంశాలతో గూడెం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు స్పష్టం అవుతున్నది. అయితే ఆయనతో పాటు ఇతర ముఖ్య నేతలంతా వరుసకట్టి పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ముచ్చటగా మూడో సారి నియోజకవర్గం ప్రజలు మహిపాల్ రెడ్డిని గెలిపించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగినప్పటికీ పటాన్ చెరులో మాత్రం గులాబీ రెపరెపలాడింది. ఆరు నెలల వ్యవధిలో ఇప్పుడు ఒక్కసారిగా పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయింది. ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కుమార్, అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప, జిల్లా పరిషత్ వైఎస్ చైర్మన్ ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలు ఎమ్మెల్యేతో కలిసి కాంగ్రెస్ లో చేరిపోయారు.

మరో వారంలో మిగతా వారు..

మహిపాల్‌రెడ్డితో పాటు ఇతర నేతలంతా సీఎం రేవంత్ రె్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఎక్కువ మంది సీఎం నివాసం వద్దకు వెళ్లడానికి అవకాశం ఇవ్వకపోవడంతో ముఖ్యులు మాత్రమే వెళ్లినట్లు చెబుతున్నారు. మొదటగా ఎమ్మెల్యేతో సహా 20 మంది చేరారు. మరో వారం, పది రోజుల్లో పటాన్ చెరులో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడే సీఎం సమక్షంలో నియోజకవర్గంలోని మిగతా నాయకత్వాన్ని మొత్తం కాంగ్రెస్ లో చేర్పించడాకి మహిపాల్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్పానగేష్ వంటి బలమైన నేతలు పార్టీ మారడంతో ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితికి చేరింది. మరో వారం రోజుల తరువాత మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుసుకున్న గులాబీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే అధిష్టాన బుజ్జగింపులను ఎవరూ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

పటాన్చెరు కాంగ్రెస్‌లో నయా జోష్..

పటాన్ చెరు ఎమ్మెల్యేతో పాటు ఇతర నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ ఖాళీ అయిపోంది. కాంగ్రెస్ వన్ సైడ్ లా మారిపోవడంతో ఆ పార్టీలో కొత్త ఉత్సహం కనిపిస్తుంది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న నేతలు ఇప్పుడు ఒకే పార్టీలో చేరిపోయారు. అందరూ కలిసిపనిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వన్ సైడ్ కాంగ్రెస్ గా మారిపోవడంతో పటాన్ చెరులో ఇక వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోనున్నట్లు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేసి, బీఆర్ఎస్ నుంచి వలసలను నివారించడానికి ఆ గులాబీ బాస్ లు ఏం చేయనున్నారనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది.


Similar News