గంజాయి దోచుకుని.. నేరస్థులను వదిలేసి
అక్రమ గంజాయి రవాణాను అరికట్టాల్సిన పోలీసులు దారి తప్పారు. గంజాయి స్మగ్లర్ల వద్ద గంజాయిని దోచుకుని సొమ్ము చేసుకున్నారు.
దిశ, సంగారెడ్డి బ్యూరో/పటాన్ చెరు: అక్రమ గంజాయి రవాణాను అరికట్టాల్సిన పోలీసులు దారి తప్పారు. గంజాయి స్మగ్లర్ల వద్ద గంజాయిని దోచుకుని సొమ్ము చేసుకున్నారు. ఓ పక్క పోలీసు ఉన్నతాధికారులు గంజాయి పై ఉక్కు పాదం మోపి కఠినంగా వ్యవహరిస్తున్న సమయంలో సంగారెడ్డి జిల్లాలో బట్టబయలైన గంజాయి స్మగ్లింగ్ బాగోతం పోలీస్ శాఖలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ వివాదంలో ఇద్దరు ఎస్సై లు, ఒక హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గంజాయి స్మగ్లర్లతో దందా చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. మల్టీ జోన్- 2 ఐజీ సత్యనారాయణ(IG Satyanarayana) వెల్లడించిన వివరాల ప్రకారం... ప్రస్తుతం పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా పనిచేస్తున్న అంబరియా, సంగారెడ్డి రూరల్ ఎస్సై గా పనిచేస్తూ అక్రమ ఇసుక రవాణా కేసులో సస్పెండ్ అయి వి ఆర్ లో ఉన్న వినయ్ కుమార్, సీసీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధు లు గతంలో సంగారెడ్డి జిల్లా మనూర్ పోలీస్ స్టేషన్ లో కలిసి పనిచేశారు. వీరిలో ఎస్సై అంబరియా, హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, పోలీస్ స్టేషన్ డ్రైవర్ గా పనిచేసే కానిస్టేబుల్ మధు మనూరు పోలీస్ స్టేషన్ లో పనిచేసే సమయంలో గత సంవత్సరం మే నెలలో వాహనాల తనిఖీలో భాగంగా మనూర్ మండలం సనత్పూర్ లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వాహనాన్ని అడ్డుకొని 120 కిలోల గంజాయిని తమ వాహనం లోకి తీసుకుని ఆ వాహనంతో సహా నేరస్తుడిని వదిలేశారు.
అదే విధంగా గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠాను చేసి నిజామాబాద్ జిల్లా వర్ని దగ్గర అడ్డుకొని అక్కడ నుంచి వారిని నారాయణఖేడ్ తీసుకువచ్చి 400 ప్యాకెట్ల గంజాయిని తీసుకుని అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వాహనంతో పాటు నిందితులను వదిలిపెట్టారు. గుట్టు చప్పుడు కాకుండా చాలా రోజుల నుంచి ఈ వ్యవహారం జరుగుతున్నట్లు సమాచారం. అయితే పోలీసుల తనిఖీల్లో గంజాయి స్మగ్లర్లు పట్టు పడడంతో వారిని విచారించగా ఈ వ్యవహారం బయటకు వచ్చింది. పోలీసులే ప్రత్యక్షంగా గంజాయి స్మగ్లర్లతో దోస్తీ చేసి గంజాయి దోచుకోవడం పట్ల ఐజీ సీరియస్ గా స్పందించారు. అక్రమ గంజాయి రవాణా తో పాటు మాదకద్రవ్యాల పై ఉక్కుపాదం మోపుతున్న పోలీస్ శాఖలో ఒకరిద్దరు ఇలాంటి పోలీసుల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి స్మగ్లర్లతో నేరుగా సంబంధం కలిగి గంజాయి దందా చేస్తున్న ఈ పోలీసులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సంబంధిత పోలీసులపై ఎన్ డీపీఎస్ యాక్ట్ కేసు నమోదుకు సాధ్యసాధ్యాలు పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.