దిశ ప్రతినిధి, సిద్దిపేట: భానుడు తన ప్రతాపాన్ని మొదలెట్టక ముందే రాజకీయ నాయకులు వేడి పుట్టించేస్తున్నారు. వేసవికి ముందే రాజకీయంగా వేడి రాజుకుంది. 2023 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలన్ని ఇతర పార్టీలను దూషిస్తూ, దిష్టిబొమ్మల దగ్ధం, బైకు ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లాలో నిరసనలు ఏ మాత్రం ఆగడం లేదు. ఒక పార్టీ ఇతర పార్టీలనాయకులపై విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమై పోయాయి.
రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, ఇతర వామపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పిస్తుండగా.. కేంద్రంపై యుద్ధానికి సిద్ధమైన టీఆర్ఎస్ పార్లమెంట్‌లో మోడీ మాటలతో అగ్రహానికి గురైన గులాబీ పార్టీ ఏకంగా దిష్టిబొమ్మల దగ్ధం, బైకు ర్యాలీలు నిర్వహిస్తోంది. దీంతో సిద్దిపేట జిల్లా అంతా ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీల నినాదాలు, నిరసనలతో హోరెత్తిపోయింది. నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యక్తిగత దూషణలు, ర్యాలీలు, దిష్టి బొమ్మల దహనాల కార్యక్రమాలతో జిల్లా అట్టుడుకుతుంది. ఇది పోలీసులకు కాస్త కష్టంగా మరిందనే చెప్పొచ్చు.
టీఆర్ఎస్ పై ప్రతిపక్షాల పోరాటం..
దేశ రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ అవమానించారంటూ బీజేపీ, కాంగ్రెస్, బీఎస్సీ సహా ఇతర వామపక్ష పార్టీలన్ని టీఆర్ఎస్ అధినేత పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్‌పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందంటూ.. కేసీఆర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు ఇంకా ఆగ్రహ జ్వాలలు చల్లారలేదు.
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులు 'బీజేపీ భీం' పేరిట బీజేపీ కార్యాలయాల్లో మౌన దీక్ష చేశారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు సైతం టీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఏకంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌కు వచ్చి స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.
ఇదిలావుండగా తాజాగా బుధవారం బీఎస్పీ, దళిత సంఘాలు ఐక్య వేదిక నాయకులు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ తీరును తప్పుబడుతూ.. రాజ్యాంగం అందించిన అంబేద్కర్ ని అవమానించడం సరికాదంటూ జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో నివాళులర్పించారు. అంతకుముందు సిద్దిపేటలోని అంబేద్కర్ నగర్ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీ ఫోటోను దగ్ధం చేశారు. తక్షణమే కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం పై టీఆర్ఎస్ యుద్ధం..
ఓ వైపు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ యుద్ధం చేస్తున్న వేళ.. ఇందుకు భిన్నంగా అధికార టీఆర్ఎస్ బీజేపీ పై మరో యుద్ధానికి సిద్ధమైంది. పార్లమెంట్ లో మోడీ తెలంగాణను అవమానించారంటూ పేర్కొంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బైకు ర్యాలీలు, మోడీ దిష్టిబొమ్మల దగ్ధం, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పెద్దయెత్తున పాల్గొన్నారు. దుబ్బాకలో మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి, సిద్ధిపేట ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి బైకు ర్యాలీ నిర్వహించి మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
అదే విధంగా చిన్నకోడూరు మండలం లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ నిరసన తెలిపారు. ఇక సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి , డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిలు పాల్గొని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు . మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వీరితో పాటు జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు , టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొని మోడీకి, బీజేపీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు.
సందిగ్ధంలో సామాన్యులు..
2023 ఎన్నికలే లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై వీలు దొరికినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. టీఆర్ఎస్ చేసేవన్నీ తప్పులేనని, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ వేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. మరోవైపు అధికార టీఆర్ఎస్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లేదని, కాంగ్రెస్, బీజేపీకి 'బీ' టీం అంటూ టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటుండటంతో సామాన్యులు సందిగ్ధంలో పడుతున్నారు. ఏ పార్టీ మాటలు నమ్మాలో తెలియడం లేదని వాపోతున్నారు.
ఏదైమైనా వేసవికి ముందే రాజకీయ వేడి రాజుకుందనే విషయం స్పష్టమైతుంది. పార్టీల కొట్లాట తో జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులకు రాజకీయ పార్టీల నిరసనలతో శాంతి భద్రతల ని కాపాడటం పెద్ద సవాల్ గా మారింది. అంతే కాకుండా అధికార పార్టీ కి మద్దతిస్తూ ప్రతిపక్షాల ధర్నాలని పోలీస్ యాక్ట్ పేరుతో అనుమతి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని పోలీసులపై విమర్శలు చేస్తున్నారు కూడా. రాజకీయ నాయకుల మధ్య నెలకొన్న వార్ చివరికి పోలీస్ వ్యవస్థ పైనను తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి పాలకులు స్వస్తి చెబుతారా .. లేక కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.