పెళ్లింట్లో విషాదం… పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా
బాచారం గ్రామాన్ని విధి వక్రీకరిస్తుందనే చెప్పవచ్చు.. 40 రోజుల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
దిశ, పాపన్నపేట: బాచారం గ్రామాన్ని విధి వక్రీకరిస్తుందనే చెప్పవచ్చు.. 40 రోజుల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. అందులో ముగ్గురు పురుషులు, ఇద్దరూ మహిళలు ఉన్నారు. గత ఫిబ్రవరి 20న సాయంత్రం నిశ్చితార్థానికి వెళ్లి వస్తు అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బాచారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మరువకముందే.. బుధవారం మరో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. బాచారం గ్రామానికి చెందిన సొంగ రాము వివాహం గురువారం జరగవలసి ఉండగా.. పెళ్లి కూతురును తీసుకురావడానికి బుధవారం కులస్తులు, గ్రామస్తులతో కలిసి ట్రాక్టర్ లో జోగిపేటకి వెళుతుండగా జోగిపేట మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జెట్టిగారి సంగమ్మ (45), రావుగారి బూదమ్మ (46)లు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మంది వరకు తీవ్ర గాయాలు కావడంతో జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు.