కాళ్ళ పారాణి ఆరకముందే అనంతలోకాలకు

ఇంట్లో వారు ఇష్టం లేని వివాహం చేశారని మనస్థాపం చెందిన ఓ మైనర్ బాలిక కాళ్ళ పారాణి ఆరకముందే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

Update: 2024-03-12 15:57 GMT

దిశ, పాపన్నపేట: ఇంట్లో వారు ఇష్టం లేని వివాహం చేశారని మనస్థాపం చెందిన ఓ మైనర్ బాలిక కాళ్ళ పారాణి ఆరకముందే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాపన్నపేట పోలీస్ స్టేషన్ ఫరిధిలోని టేక్మాల్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధి టేక్మాల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలికకు ఈనెల 4న అదే గ్రామానికి చెందిన సమీప బంధువైన వ్యక్తితో కుటుంబీకులు వివాహం చేశారు. ఇష్టం లేని వివాహం చేశారని మనస్థాపం చెందిన బాలిక మంగళవారం తన తల్లి గారి ఇంటి బయట ఉన్న బాత్రూంలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో అటుగా వెళ్లిన కుటుంబీకులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామ ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


Similar News