నేల రాలుతున్న తెల్ల బంగారం..
రైతు బతుకు ఆగమవుతుంది. పత్తి రైతు బతుకు మరి దారుణంగా ఉంది. పత్తిని అమ్మబోతే అడవి, పత్తి తెంపబోతే కొరివిలాగా తయారైంది.
దిశ, ఝరాసంగం : రైతు బతుకు ఆగమవుతుంది. పత్తి రైతు బతుకు మరి దారుణంగా ఉంది. పత్తిని అమ్మబోతే అడవి, పత్తి తెంపబోతే కొరివిలాగా తయారైంది. అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోగా చేతికొచ్చిన పత్తిని తెంపేందుకు కూలీలు దొరకక అయోమయానికి గురవుతున్నారు. ఉన్న పత్తి నేల రాలుతోంది. గ్రామాల్లో కూలీలకు కిలో రూ.15 ఇస్తామన్న కూలీలు దొరకడం కష్టతరమవుతుంది. గురువారం "దిశ " ఝరాసంగం మండలంలోని మేదపల్లి, ఈధులపల్లి, గినియార్ పల్లి, దేవరంపల్లి, ప్యారవరం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లగా గ్రామాలలో కూలీలు దొరకక పత్తి పొలాల్లోనే ఉండిపోయింది. ఉన్న కొంత పత్తి సైతం నేల రాలుతోంది.
పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ పంట కోత సమయంలో పక్షం రోజులు భారీ వర్షాలు కురిశాయి. పత్తి పంట ఎకరాకు సుమారుగా 8 క్వింటాలు దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. కానీ ఎకరాకు మూడు లేదా నాలుగు క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి వర్షానికి తడిసి ఎండలకు ఎండి బరువు బరువు తగ్గింది. పత్తి బరువు రాక కోతకు కూలీలు దొరకడం లేదు. పత్తి ధర లేకపోవడంతో తీసిన పత్తిని రైతులు నిల్వ ఉంచడం పలు గ్రామాల్లో కనిపించింది. పత్తికి రక్షణగా రైతులు చలికి లెక్క చేయకుండా అక్కడే నిద్రిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 6.96 లక్షల ఎకరాలు వివిధ పంటలు సాగులో ఉంది. అందులో జహీరాబాద్ డివిజన్ పరిధిలో 62 వేల ఎకరాల్లో పత్తి సాగు ఉండగా ఝరాసంగం మండల వ్యాప్తంగా 25,450 వేల ఎకరాలలో సాగు చేశారు.