ప్రభుత్వాసుపత్రిలో అరగంటలోనే గొంతు ఆపరేషన్
ఆసుపత్రికి వచ్చిన అరగంట లోపే ఆపరేషన్ చేసి అమ్మాయి ప్రాణాలు కాపాడిన సిద్దిపేట ప్రభుత్వ వైద్య సిబ్బందికి ప్రజల నుంచి ప్రశంసలు వెల్లివిరిశాయి.
అమ్మాయి ప్రాణాలు కాపాడిన వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట అర్బన్: ఆసుపత్రికి వచ్చిన అరగంటలోపే ఆపరేషన్ చేసి అమ్మాయి ప్రాణాలు కాపాడిన సిద్దిపేట ప్రభుత్వ వైద్య సిబ్బందికి ప్రజల నుంచి ప్రశంసలు వెల్లివిరిశాయి. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన కీర్తన గొంతు సమస్యతో తీవ్రంగా బాధపడుతోంది. గత నెల రోజుల క్రితమే హైదరాబాద్ లోని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రూ.లక్షలు రూపాయలు వెచ్చించి గొంతుకు సంబంధించి ఆపరేషన్ చేయించారు.
అయినా, గొంతు వ్యాధి నయం కాలేదు. గత పదిహేను రోజుల క్రితం అమ్మాయికి గొంతు నొప్పి తో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో మళ్లీ యశోద ఆసుపత్రికి వెళ్లి రూ.వేల రూపాయలు ఖర్చు చేసి ట్రీట్మెంట్ తీసుకున్నారు. సోమవారం ఒక్కసారిగా అమ్మాయికి ఆక్సిజన్ లెవెల్ పడిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో అమ్మాయి తల్లిదండ్రులు హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెళ్లిన అరగంటలోపే ఈ.ఎన్.టీ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజ్ తమ వైద్య బృందంతో కలిసి ఎమర్జెన్సీగా గోంతు (స్వరపేటిక) ఆపరేషన్ చేసి అమ్మాయి ప్రాణాలను కాపాడారు.
ఏ మాత్రం ఆలస్యం చేసిన అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం ఉండేదని సమయంలో ఆసుపత్రికి తీసుకరావడంతో అమ్మాయి ప్రాణాలను కాపాడామని డాక్టర్ నాగరాజు తెలిపారు. ఇలాంటి వ్యాధి లక్షల మందిలో ఒక్కరికి వస్తుందని అలాంటిదే కీర్తనకు వచ్చిందని తెలిపారు. సిద్దిపేటలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వాసుపత్రిని ఏర్పాటు చేసి తమ లాంటి పేద బిడ్డలకు వైద్యం అందిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కి తాము ఎల్లవేళలా రుణపడి ఉంటామని కీర్తన కుటుంబ సభ్యులు తెలిపారు.
అదేవిధంగా తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన సిద్దిపేట ప్రభుత్వ వైద్య బృందానికి తల్లిదండ్రులు మమత, ఆంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ ఆరోగ్యం కోసం రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసిన యశోద ఆసుపత్రి యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావును కోరారు. డైరెక్టర్ విమల థామస్, సూపర్డెంట్ కిషోర్, డాక్టర్ ముజీబ్, అనస్తీషియా డాక్టర్ చందర్, డాక్టర్ అనుపమ, డాక్టర్ సురేష్, డాక్టర్ సంతోష్, వైద్య బృందం ఉన్నారు.