అనాథలైన ముగ్గురు పిల్లలు.. కదిలిన మానవతా వాదులు
తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిన హృదయ విదారక ఘటన ఇంద్రుప్రియాల్ లో చోటుచేసుకుంది.
దిశ, దౌల్తాబాద్ : తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిన హృదయ విదారక ఘటన ఇంద్రుప్రియాల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దౌల్తాబాద్ మండలానికి చెందిన దివ్యాంగుడైన పోతరాజు వెంకటేశ్(26) ప్రభుత్వం ఇచ్చిన త్రిచక్ర వాహనంపై మంగళవారం పని నిమిత్తం రాత్రి గజ్వేల్ కు వెళుతున్నాడు. ఈ క్రమంలో కుమ్మరోనికుంట వద్ద జరిగిన ప్రమాదంలో అతను మరణించాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు.
భార్య చాల రోజుల క్రితమే వెంకటేశ్ ను వదిలి వెళ్లపొయింది. వెంకటేశ్ తనకు వచ్చే వికలాంగుల పెన్షన్ తో తన పిల్లలను పొషించాడు. దీంతో ప్రస్తుతం ఆ చిన్నారులు తండ్రి లేక రోదిస్తున్నారు. దీంతో స్పందించిన మానవతా వాదులు వెంకటేష్ అంతక్రియలు, పిల్లలకు ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. బహుజన సైన్యం వాట్సప్ గ్రూప్ లో విషయాన్ని పోస్ట్ చేసిన వెంటనే సమాచారం తెలుసుకున్న గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సంబగ యాదగిరి విజ్ఞప్తి మేరకు డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ స్పందించి రూ.వెయ్యి సాయం చేశారు.
అదేవిధంగా మానవ హక్కుల వేదిక నాయకులు జీవన్ కుమార్, డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన స్పందించి రూ.వెయ్యి చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. సీనియర్ జర్నలిస్టు దేవి కిరణ్, విష్ణు, సీఆర్పీ యాదగిరి రూ.500 ఆర్ధిక సాయం అందించారు. పిల్లలను జిల్లా బాలల సంరక్షణ కమిటీ ఎదుట హజరు పరిచి అనాథాశ్రమంలో చేర్పిస్తామని శంకర్ తెలిపారు. వాళ్ల చదువు బాధ్యత డీబీఎఫ్ తీసుకుంటుందన్నారు. పిల్లలకు సాయం చేయానుకునే వారు 9441131181 ఫోన్ నెంబర్ కు సంప్రదించాలన్నారు.