మంచి ఉద్దేశంతో చేసే పనులు చిరస్థాయిగా నిలుస్తాయి : సీఎం రేవంత్ రెడ్డి
చర్చి నిర్మాణం కోసం చేపట్టిన పనికి ఆహార పథకం స్ఫూర్తితోనే
దిశ, మెదక్ ప్రతినిధి : చర్చి నిర్మాణం కోసం చేపట్టిన పనికి ఆహార పథకం స్ఫూర్తితోనే ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకు వచ్చిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మెదక్ మహా దేవాలయం చర్చిలో జరిగిన వందేళ్ల క్రిస్మస్ ఉత్సవాల్లో సీఎం తో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఎమ్మెల్యే రోహిత్, మైనంపల్లి హనుమంతరావు లు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వందేళ్లు భక్తుల పొందుతున్న చర్చి మహా అద్భుతం గా వర్ణించారు. మెదక్ చర్చి నిర్మాణం కరువులో ఉన్న ప్రజలకు కడుపు నింపాలన్న మంచి ఉద్దేశ్యం తో మహా దేవాలయం నిర్మాణం జరిగిందన్నారు. చర్చి నిర్మాణం లో పని చేసిన వారికి కడుపు నింపిందని చెప్పారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకు వచ్చి పేదలకు అండగా నిలిచిందని అన్నారు.
మంచి ఉద్దేశంతో చేసే పనులు చిరస్థాయిగా నిలుస్తాయని, అదే విధంగా చర్చి కూడా ఆసియాలోనే అద్భుత మహా దేవాలయం గా గుర్తింపు పొందిందని చెప్పారు. చర్చి తో మంచి బంధం ఉందని, పీసీసీ అధ్యక్షుడి హోదాలో చర్చి వచ్చి మళ్ళీ తాను సీఎం హోదాలో లో వస్తానని చెప్పానని, అదే విధంగా మీ ముందుకు వచ్చానని చెప్పారు. భక్తుల ఆదరణ పొందుతున్న చర్చి వందేళ్ల సేవలు అందిస్తుందని, చర్చి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ అడిగిన వెంటనే నిధులు మంజూరు చేయాలనీ మంత్రులను కోరినట్టు చెప్పారు. అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు 29 కోట్లు మంజూరు చేశామని, భవిష్యత్తు లో చర్చి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
మెదక్ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడు ముందుతుందని, అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్లలో క్రిస్టియన్ దళిత, గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పది లక్షల ఆరోగ్య భీమా, రైతాంగానికి 500 బోనస్, రైతులకు 21 వేల కోట్ల రుణ మాఫీ చేసినట్లు సీఎం తెలిపారు. గతంలో మిషినరీలు సేవా దృక్పథం తో విద్యా, వైద్యం అందించయని, ప్రభుత్వం కూడా అదే బాటలో పేదలకు అందిస్తుందని చెప్పారు. వందేళ్ల చర్చి ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చర్చిలో ఇంచార్జి బిషప్ రుబెన్ మార్క్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మెదక్ నుంచి ఏడుపాయల వరకు కాంగ్రెస్ జెండాలు..
సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. మెదక్ పట్టణంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండాలు, సీఎం ఫ్లెక్సీ లతో నింపేశారు. ప్రధాన రహదారులు పూర్తిగా కాంగ్రెస్ జెండాలు ఫ్లెక్సీలతో అలకరించారు. ఏడుపాయల గుడి సమీపంలో భారీ ఫ్లెక్సీలు ఎమ్మెల్యే తో పాటూ కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఏడుపాయల వరకు వెళ్ళే నర్సాపూర్ ప్రధాన రోడ్డుపై దాదాపు పది కిలోమీటర్ల మేర కాంగ్రెస్ జెండాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సీఎం రోడ్డు మార్గంలో రావడం తో ఆయన దృష్టిలో పడేందుకు జిల్లాకు చెందిన నేతలతో పాటు ఇతర జిల్లాకు చెందిన నేతలు సైతం స్వాగతం పలుకుతూ ప్లెక్సీ లు ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ తో పాటు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎంపీ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు.