రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరిలో ఒక్కరమే ఉండాలి

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంత రావు నిప్పులు చెరిగారు.

Update: 2024-08-20 12:13 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంత రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతాం..ఎవరైనా రైతులకు టెక్నికల్ సమస్య వల్ల రుణ మాఫీ కాని పక్షంలో పరిష్కరించి రుణ మాఫీ చేస్తామని అన్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు ఇచ్చి మాట ప్రకారం సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇద్దరం పోటీ చేద్దాం అని, తాను ఓడిపోతే రాజకీయాల్లో ఉండా.. నీవు ఓడిపోతే రాజకీయాల్లో ఉండొద్దు.. రాష్ట్ర రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు లేదా హరీష్ రావు ఎవ్వరో ఒక్కరే ఉండాలని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సర్వ సాధారణం అని, తాను సెంచరీ చేయడానికైనా..

     డక్ ఔట్ కావడానికైనా సిద్దం హరీష్ రావు సిద్దమా అని సవాల్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణ మాఫీ అభినందన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మైనంపల్లి మాట్లాడుతూ... మెదక్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అమర వీరుల కుటుంబానికి సీటు ఇద్దామని, సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తే పోటీ చేద్దామని సవాల్ చేస్తే హరీష్ రావు ముందుకు రాలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలకు రుణమాఫీ కావొద్దని ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణను ఉద్దరించింది ఏమీ లేదని.. లక్షల కోట్లు కొల్ల కొట్టారని మండిపడ్డారు.

    బీఆర్ఎస్ నాయకులు జైలుకు పోవడం ఖాయమన్నారు. రంగనాయక సాగర్ పేరిట పేద రైతుల భూములు కొనుగోలు చేసి ఫాం హౌస్ కట్టుకున్న ఘనత హరీష్ రావుది అన్నారు. రైతుల వద్ద రూ.3 లక్షలకు ఎకర చొప్పున కొనుగోలు చేసి డీఎక్స్ ఎన్ కంపెనీకి రూ.15 లక్షలకు ఎకరా చొప్పున అమ్ముకొని వేల కోట్ల కుంభకోణానికి హరీష్ రావు పాల్పడ్డాడని ఆరోపించారు. 59, 58 జీవోలలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పెట్టాల్సిందే అన్నారు. అగ్గి పెట్టె దొరకలేదని హరీష్ రావు రాజకీయం

    చేస్తే శ్రీకాంతాచారి ప్రాణత్యాగం చేశాడని, 12 వందల మంది అమర వీరుల ఉసురు కల్వకుంట్ల కుటుంబానికి, హరీష్ రావుకు తాకుతుంది అన్నారు. సిద్దిపేటకు పట్టిన శని వదిలే వరకు మళ్లీ మళ్లీ వస్తా.. మకాం వేస్తా హరీష్ రావు ను తోటపల్లికి పంపే వరకు వెంటాడుతా అని మైనంపల్లి స్పష్టం చేశారు. అంతకు మందు బీజేఆర్ చౌరస్తా నుంచి కోమటి చెరువు మీదుగా పాత బస్టాండ్ వరకు రైతు రుణ మాఫీ అభినందన ర్యాలీలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, డీసీసీ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జులు పూజల హరికృష్ణ , చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Tags:    

Similar News