దిశ, సంగారెడ్డి/కొండాపూర్ : రియల్ వ్యాపారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. వారికి రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా రైతులు వాడుకుంటున్న వరద కాలువలను రియల్టర్లు (Realtors) మింగేశారు. గతంలో వరద కాలువలు పూడ్చి యథేచ్ఛగా అక్రమ వెంచర్ అనే కథనాన్ని మార్చి 24వ తేదీన ప్రచురించిన విషయం విధితమే. ఇందుకు స్పందించిన అధికారులు జేసీబీ సహాయంతో పోసిన మట్టిని తవ్వి వరద కాలువను క్లీయర్ చేశారు. అది నాటి మాట నేడు అదే రెవెన్యూ అధికారులు వెంచర్ పేరు మార్చిన యాజమాన్యానికి సహకారం అందించారు.
ఇదంతా కొండాపూర్ (Kondapur) మండల పరిధిలోని మన్సాన్పల్లి గ్రామంలో సర్వేనెంబర్ 188, 189 లో సండే మార్నింగ్ విల్లా పేరుతో గతంలో ఏర్పాటు చేసిన వెంచర్ పేరు మార్చి శ్రీ ఇన్ కోర రియల్టీ ప్రాజెక్ట్స్ పేరిట వెంచర్ (Venture) ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. సర్వేనెంబర్ 188 లో 37 గుంటలతో సర్వేనెంబర్ 189లో కలిపి మొత్తం 10.27 గుంటలకు కన్వర్షన్ చేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు ఆర్జి పెట్టుకున్నారు. ఈ సర్వేనంబర్లలో ఈ వెంచర్ లో ఎన్నో వరద కాలువలు ఉన్నాయి. వాటిని యథేచ్ఛగా మింగేశారు. పూర్తిగా నాలుగు పెద్ద కాలువలు, మూడు చిన్న వరద కాలువలను పూడ్చి వేశారు. ఈ వరద కాలువలకు కూడా రెవెన్యూ అధికారులు కన్వర్షన్ చేయడం గమనార్హం.
వరద కాలువలకు కన్వర్షన్ చేసిన రెవెన్యూ అధికారులు..
సర్వే నంబర్ 188, 189లో ఉన్న నాలుగు పెద్ద వరద కాలువలు, మూడు చిన్న వరద కాలువలను రియల్టర్లు ఆక్రమించి వాటిని పూర్తిగా పూడ్చి వేశారు. దీనిపై గతంలోనే గ్రామస్తులు ఇరిగేషన్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అందుకు స్పందించిన ఇరిగేషన్ అధికారులు వెంచర్( Venture) ఆక్రమించిన కాలువలను పరిశీలించి నిజమే కాలువలను ఆక్రమించారని రెవెన్యూ అధికారులకు నివేదికలు అందించారు. ఇరిగేషన్ అధికారులు కాలువలు ఆక్రమించారని రిపోర్టు ఇస్తే రెవెన్యూ అధికారులు ఆ వరద కాలువలు పట్టాభూములే అంటూ కన్వర్షన్ చేశారు. ఓ వైపు చెరువులు, కుంటలు, కాలువలు ఆక్రమణకు గురైతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే కొండాపూర్ మండలంలో మాత్రం రెవెన్యూ అధికారులు ముఖ్యంగా తహసీల్దార్, ఆర్ఐలు మాత్రం యదేచ్చగా ఆక్రమణదారులకు చేదోడు వాదోడుగా ఉంటూ రైతులుకు ఉపయోగంగా ఉన్న వరద కాలువలను కన్వర్షన్ చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వేనంబర్ 188, 189 లకు కలిపి మొత్తం 10.27 గుంటలకు ఈ నెల 26వ తేదీన కన్వర్షన్ (Conversion) చేస్తూ ఆర్డర్ విడుదల చేశారు. మన్సాన్ పల్లి గ్రామ ప్రజలకు ఉపయోగపడే వరద కాలువలు ఆక్రమించినా వాటికి ఎలా కన్వర్షన్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
సర్వేనంబర్లకు బై నంబర్లు వేస్తూ కన్వర్షన్ చేసిన అధికారులు..
కొండాపూర్ మండలం మన్సాన్పల్లి గ్రామంలోని సర్వే నంబర్ 188, 189లో శ్రీ ఇన్ కోర రియాల్టీ ప్రాజెక్ట్స్ పేరిట నాలా కన్వర్షన్ చేయాలని జి.విజయ్ కుమార్ రెవెన్యూ అధికారులకు ధరఖాస్తు చేసుకున్నారు. అయితే ఈ సర్వే నెంబర్లలో నాలుగు పెద్ద కాలువలు, మూడు చిన్న వరద కాలువలు ఉన్నాయి. వీటిని కూడా పరిగణలోకి తీసుకున్న కొండాపూర్ తహసీల్దార్ సర్వేనబంర్లను బై నంబర్లు వేస్తూ కన్వర్షన్ చేశారు. మొత్తం 188 సర్వేనెంబర్ ఒకటి కాగా 189 సర్వే నెంబర్ కు 72 బై నంబర్లు వేస్తూ గుంటల లెక్కన కన్వర్షన్ చేస్తూ ప్రొసీడింగ్స్ 2400713939 పేరిట నాలా కన్వర్షన్ (Conversion) చేస్తూ ఆర్డర్ విడుదల చేశారు. ఈ సర్వేనంబర్లలో కాలువలు ఉన్నాయని గతంలో ఇరిగేషన్ అధికారులు నివేదిక సైతం రెవెన్యూ అధికారులకు అందించారు. కానీ వాటిని పక్కన బెట్టిన అధికారులు కావలకు సైతం కన్వర్షన్ చేయడం గమనార్హం.
వరద కాలువలను కాపాడాల్సిన అధికారులే ఆక్రమణదారులకు వత్తాసు పలకడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆక్రమణలను సహించేది లేదు.. వాటిని ఎవ్వరూ ఆక్రమించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుంటే కొండాపూర్ రెవెన్యూ అధికారులు మాత్రం వారిని లెక్కచేయకుండా ఇష్టానుసారం నాలా కన్వర్షన్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమించి వరద కాలువలను కాపాడాలని, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.