Kodandaram : విద్యా రంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

విద్యా రంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

Update: 2024-09-19 16:37 GMT

దిశ గజ్వేల్/ కొండపాక : విద్యా రంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గజ్వేల్ జోన్ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన "ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ… విద్యా రంగం అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారు విద్యార్థులకు విజ్ఞానం ప్రసాదించడంలో స్ఫూర్తి స్వరూపం గా నిలవాలని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయులు ఎంతో ప్రముఖమైన పాత్ర పోషించారని, ఇప్పుడు రాష్ట్ర నిర్మాణంలో వారికి ఇంకా విస్తృత అవకాశం ఉందని గుర్తు చేశారు.

గతంలో విద్యా రంగంలో ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మితిమీరిన రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా పోరాడిన సంస్థ టీపీటీఎఫ్ అని వారు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఇటీవల సీఎం తో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించామని, ముఖ్యమంత్రి విద్యా వ్యవస్థను బాగు చేయడానికి చాలా పట్టుదలతో ఉన్నారని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడిగిన సమస్యలకు సానుకూల స్పందన వచ్చిందని, ఇటీవలే విద్యా కమిషన్ ఏర్పడిందని, దీని ద్వారా విద్యా రంగం మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు ఆకర్షించేందుకు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

మన పిల్లల చదువు పట్ల ఎంత శ్రద్ధ చూపుతామో, అదే శ్రద్ధతో మన పాఠశాలలోని విద్యార్థుల పట్ల కూడా ఉండాలని ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ కృషితో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పూర్వాపరాలు తెలుసుకొని పరిష్కరించడానికి సిద్ధంగా ఉందని, ఉపాధ్యాయులకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. మిగిలిన సమస్యలపై త్వరలోనే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అనంతరం కోదండరాం ని శాలువాతో సన్మానించారు. అనంతరం నూతనంగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులను ఆయన చేతుల మీదుగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, గజ్వేల్ జోన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Similar News