కేంద్ర, రాష్ట్రాల సహకారంలో జిల్లా అభివృద్ధికి కృషి

కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చే నిధుల సహకారంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషిచేయనున్నామని జహీరాబాద్ ఎంపీ దిశ(డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం జడ్పీ సీఈఓ జానకి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

Update: 2024-09-19 12:47 GMT

దిశ, సంగారెడ్డి : కేంద్రం, రాష్ట్రాలు ఇచ్చే నిధుల సహకారంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషిచేయనున్నామని జహీరాబాద్ ఎంపీ దిశ(డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో ఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) సమావేశం జడ్పీ సీఈఓ జానకి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వివిధ శాఖల వారిగా పూర్తిగా సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. సమావేశానికి వచ్చిన అధికారులు తమ వద్ద పూర్తి సమాచారం లేదని, తాము కొత్తగా వచ్చామని పలు కారణాలు చెప్పారు. దీంతో కో చైర్మన్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధికారులపై సీరియస్ అయ్యారు. అధికారులు మారిన కార్యాలయంలోని కంప్యూటర్ లో పూర్తి సమాచారం ఉంటుందని, దానిని ఎందుకు తెచ్చుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి శాఖ నుంచి కూడా ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరియైన సమాధానం ఇవ్వలేదు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశం జరుగుతుందని, వచ్చే సమావేశానికి పూర్తి సమాచారంతో రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలో ఇద్దరం ఎంపీలము ఉన్నామని, జిల్లా అభివృద్ధికి కావలసిన ప్రపోజల్స్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి జిల్లాకు ఎన్ని నిధులు వస్తున్నాయి, రాష్ట్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి ఇంకా ఎన్ని నిధులు అభివృద్ధికి కావాలో అధికారులు శాఖల వారిగా ప్రపోజల్స్ ఇవ్వాలన్నారు. కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్ నిమ్జ్ లో ఇండస్ట్రీయల్ స్మాల్ సిటీ మంజూరు చేసిందని దీని వల్ల ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు సమన్వయంతో సహకరించాలని సూచించారు.

మున్సిపాలిటీలలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న కమిషనర్లు : మెదక్ ఎంపీ రఘునందన్ రావు

అమీన్ పూర్, తెల్లాపూర్, ఐడీఏ బొల్లారం, కొల్లూరు, ఐలాపూర్ లో అక్కడి మున్సిపల్ కమిషనర్లు ప్రభుత్వ అసైన్డ్ భూములలో 100 గజాల చొప్పున ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిర్వహించిన దిశ సమావేశానికి ఈ నాలుగు మున్సిపాలిటీ కమిషనర్లు ఎందుకు హజరుకాలేదని, వారి బండారం బయటపడుతుందనే వారు సమావేశానికి రాలేదన్నారు. అదే వీరి పరిధిలో ప్రతి రోజు 150 ఇంటి నంబర్లు ఇస్తున్నారని, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమీన్ పూర్ మున్సిపాలిటీలో 17.09 ఎకరాల భూమిని కబ్జా చేశారని, వారికి మున్సిపల్ కమిషనర్లు సహకరిస్తున్నారన్నారు.

ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న కమిషనర్లు పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతిని కోరారు. అదే విధంగా వనమహోత్సవంపై సమీక్షిస్తూ సంగారెడ్డి జిల్లాలో ఉన్న భూ విస్తీర్ణం ఎంత ? 2014 నుంచి 2024 వరకు ఎన్ని మొక్కలు నాటారని అధికారులను ప్రశ్నించారు. అందుకు వారు స్పందిస్తూ 9 కోట్ల 44 లక్షల మొక్కలు నాటినట్లు అధికారులు వివరించారు. అంత జాగా సంగారెడ్డి జిల్లాలో ఉందా వనమహోత్సవం, హరితహారం పేరిట పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వ డబ్బులను మింగేందుకు హరితహారం కార్యక్రమం నిర్వహించారని, నాటిన చోటనే తిరిగి మొక్కలు నాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్చ భారత్ మిషన్ కింద జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మరుగుదొడ్లు నిర్మించాలని కమీషనర్లకు సూచించారు. అదే డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించాలని, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా తడి, పొడి చెత్తను వేరు చేయాలన్నారు.

అదే చెత్త నుంచి ప్లాస్టిక్ ను వేరు చేసి డీజిల్ తయారు చేస్తున్నారని, దానిని జిల్లాలో కూడా అధికారులు అమలు చేయాలని సూచించారు. అదే విధంగా వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, డీసీవో, అధికారులను అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెప్పలేదు. మీ వద్ద సమాచారం లేదని, ఫీల్డ్ విజిట్ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు సమన్వయంతో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, జిల్లాకు కావాల్సిన ప్రణాళికలు రూపొందించి ఇస్తే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరెడ్డి, మానిక్ రావు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్డీఓ జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News