Disha Effect : టేక్మాల్ సొసైటీ సీఈఓ పై వేటు
టేక్మాల్ సొసైటీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన కథనాలపై అధికారులు చేపట్టిన విచారణలో సొసైటీ అధికారులపై వేటు పడింది.
దిశ, ఆందోల్: టేక్మాల్ సొసైటీలో నిధుల దుర్వినియోగంపై వచ్చిన కథనాలపై అధికారులు చేపట్టిన విచారణలో సొసైటీ అధికారులపై వేటు పడింది. ఆగస్టు 1వ తేదీన 'దిశ' దినపత్రికలో ప్రచురితమైన ' టేక్మాల్ సొసైటీ భూమి కొనుగోలు వివాదం' కథనం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దిశ దిన పత్రిక ఆధారాలతో సహా విశ్లేషణాత్మక కథనానికి అధికారులు స్పందించారు. ఈ అవకతవకలపై జిల్లా సహకార సంస్థ అధికారి కరుణ సమగ్ర విచారణ చేపట్టింది. ఈనెల 12వ తేదీ నుంచి టేక్మాల్ సొసైటీ కార్యాలయానికి వెళ్లి అధికారులు రికార్డులను పరిశీలించారు. అధికారుల విచారణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు తేలింది. సొసైటీ పేరిట స్థలం కొనుగోలులో, వరి కొనుగోలు కేంద్రం కమిషన్ లో అవినీతికి పాల్పడినట్లు, సొసైటీ పెట్రోల్ పంపు రికార్డు సరిగ్గా లేనట్లుగా అధికారులు గుర్తించారు.
టెక్మాల్ సొసైటీ భూమి కొనుగోలు విషయంలో రూ. 3 లక్షలు చెల్లించి ఇచ్చినట్లు డాక్యూమెంట్‌లో చూపిన విషయం అధికారుల విచారణలో నిజమని తేలినట్లు తెలుస్తుంది. టేక్మాల్‌కు చెందిన చిలకమర్రి కుటుంబ పెద్దలు 1952లో సోసైటీకి 2.12 ఎకరాల భూమిని దానం ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ ఆ భూమిని సోసైటీ పేరిట చేసుకోవడంలో అప్పట్లో నిర్లక్ష్యం చేశారు. అయితే గ్రామస్థులంతా కలిసి భూమి దానం విషయాన్ని వారి వారసులతో చర్చించి రిజిస్ట్రేషన్ కోసం వారిని ఒప్పించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి చిలకమర్రి దుర్గారెడ్డికి చెందిన 1952/అ సర్వేనంబర్‌లో 0.28 గుంటలు, చిలకమర్రి మోహన్‌రెడ్డికి చెందిన 1952/ఇ సర్వేనంబర్‌లో 0.20.05 గుంటలు, చిలకమర్రి కేశవరెడ్డికి చెందిన 1952/ఇ/2 సర్వేనంబర్‌లో 0.20.05 గుంటలు, చిలకమర్రి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన 1952/అ2/2 సర్వెనంబర్‌లో 0.11.05 గుంటలు, చిలకమర్రి శ్రీధర్‌రెడ్డికి చెందిన 1952/అ2/1సర్వేన ంబర్‌లో 0.11.05 గుంటలు మొత్తం 2.12 ఎకరాల భూమిని 2018 ఏప్రీల్ 23నాడు సెల్ డీడీ కింద టేక్మాల్ సోసైటీ సీఈవో వేణుగోపాల్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకు గాను సోసైటీ నుంచి కేవలం రూ.3 లక్షలు మాత్రమే రైతులకు చెల్లించి రూ.27.83 లక్షలను ఇచ్చినట్లు చూపించడం సంచలనం రేపింది.
పెట్రోల్ బంక్ లో చేతివాటం
టేక్మాల్ సోసైటీలో పెట్రోల్ పంపు నిర్మాణం చేపట్టి డిజీల్, పెట్రోల్ ట్యాంక్‌లను అమ్ముకుని రూ.30 లక్షలు కాజేశారని విచారణలో వెల్లడైనట్లు సమాచారం. సోసైటీ తరపున వానాకాలం, యాసంగీ సీజన్‌లో వరి కొనుగోలు కేంద్రాలలో అవినీతి చేశారని, రైతులకు ఇచ్చిన రుణాల్లో 10 శాతం షేర్ అమౌంట్ తీసుకొవాల్సి ఉండగా, 15 శాతం వసూలు చేసి చైర్మన్ అవినీతికి పాల్పడ్డ విషయం విచారణలో బట్టబయలు అయినట్లు తెలుస్తుంది.
విచారణలో భాగంగా అధికారులు సోసైటీ కార్యాలయంలో చైర్మన్, సీఈవోలపై ప్రశ్నల వర్షం కురిపించిన సమాధానం దాటవేస్తూ ఉండటం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పూర్తి విచారణ జరిపిన అధికారులు దిశ వెల్లడించిన వివరాలు నిజమని తేలడంతో సీఈఓ వేణు గోపాల్ ను సస్పెండ్ చేస్తూ డీసీఓ కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంలో మరింత లోతుగా విచారణ జరిపి దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా అధికారులు సమాయత్తమవుతున్న ట్లు తెలుస్తుంది. ఈ కుంభకోణంలో చైర్మన్ తో పాటు సభ్యుల హస్తం పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.