గ్రామ సర్వసభ సమావేశాన్ని బై కాట్ చేసిన పంచాయతీ పాలకవర్గం
గుమ్మడిదల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ నరసింహారెడ్డి అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు.
గుమ్మడిదల: గుమ్మడిదల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ నరసింహారెడ్డి అధ్యక్షతన సర్వసభ సమావేశాన్ని నిర్వహించారు. కాగా ఈ సమావేశంలో ఇటీవలె చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను, అభివృద్ధి పనులను పంచాయతీ కార్యదర్శి రాములు పాలకవర్గానికి వివరించారు. అనంతరం పలువురు వార్డు సభ్యులు గ్రామంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భూమి డెవలపర్స్ వెంచర్ నిబంధనలను పాటించకుండా వెంచర్ను ఏర్పాటు చేశారని ఆ యొక్క వెంచర్ పై ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడానికి తీర్మానం రూపొందించాలని పంచాయతీ కార్యదర్శిని కోరారు. కాగా ఈ విషయంపై కార్యదర్శి అలా రూపొందించలేమని సభ్యులకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా సర్పంచ్ మినహా పాలకవర్గం సభ్యులు పూర్తిగా సభను బై కట్ చేసి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో గత సంవత్సర కాలంగా శ్రీ భూమి డెవలపర్స్ అనే సంస్థ వెంచర్ను ఏర్పాటు చేశారని ఈ వెంచర్ అనుమతుల కొరకు జీపీ నుండి ఉన్న 25 ఫీట్ల రోడ్డును 40 ఫీట్లుగా తప్పుడు పత్రాలను సృష్టించి అనుమతులు పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే ఇప్పటివరకు గ్రామ పంచాయతీకి కేటాయించాల్సిన 10% భూమిని కేటాయించకుండా ఫ్లాట్లను విక్రయిస్తున్నారని.. ఈ విషయంపై గత మూడు నెలలుగా పంచాయతీ కార్యదర్శి దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లిన స్పందించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా ఇదే విషయంపై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడానికి తీర్మానం రూపొందించాలని కోరగా తన పరిధిలోని విషయం కాదని సులువుగా మాటను దాటి వేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి స్పందించి ఈ వెంచర్ పై చర్యలు తీసుకోకపోతే జిల్లా పంచాయతీ అధికారులకు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శి రాములు వివరణ
నేడు నిర్వహించిన సర్వసభ సమావేశంలో సభ్యులు శ్రీ భూమి డెవలపర్స్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని తనను కోరారని తెలిపారు. కాగా ఈ వెంచర్ పూర్తిగా హెచ్ఎండీఏ నుండి అనుమతులు పొందిందని అందుకు సంబంధించిన పూర్తి పత్రాలను పంచాయతీకి సమర్పించారన్నారు. ఈ వెంచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న హెచ్ఎండీఏ పరిధిలోని విషయమని ఆ అంశమే సభ్యులకు వివరిస్తుండగా సభను బైకాట్ చేసి వెళ్లిపోయారని తెలిపారు. అయినప్పటికీ పాలకవర్గం అభ్యర్థన మేరకు హెచ్ఎండీఏ రెవెన్యూ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి నివేదిక తయారు చేస్తామని తెలిపారు.