ఆలోచన అమోఘం.. నిర్వహణ ఘోరం..

దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు సమయాన్ని ఆదా చేసేందుకు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొకుండా, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా, కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ జాతీయ రహదారులను విస్తరించి రోడ్డు నిర్మాణాలు చేపట్టింది.

Update: 2024-11-03 08:02 GMT

దిశ, అల్లాదుర్గం : దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రజలకు సమయాన్ని ఆదా చేసేందుకు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొకుండా, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా, కేంద్ర ప్రభుత్వ జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ జాతీయ రహదారులను విస్తరించి రోడ్డు నిర్మాణాలు చేపట్టింది. 161 అకోలా - నాందేడ్ జాతీయ రహదారి విస్తరణ పనులు 2018 - 19 లో నిర్మాణ విస్తరణ పనులు చేపట్టి 2020 - 21 లో పూర్తి చేసింది. జాతీయ రహదారి గుండా వెళ్లే గ్రామాల వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పనులు పూర్తిచేసినా నిర్వహణ మాత్రం చేయలేకపోతుందనీ వాహనాదారులు వాపోతున్నారు. రోడ్డు పనులు పూర్తయి మూడు సంవత్సరాలు గడిచిపోవడం, అక్కడక్కడ వర్షపు నీరు, బ్రిడ్జిల వద్ద నిలిచిపోవడంతో పాటు అధికలోడుతో పలు వాహనాలు బ్రిడ్జిల గుండా వెళ్లడంతో రోడ్డు పగుళ్లు ఏర్పడి గుంతల మయం కావడంతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

జాతీయ రహదారుల సంస్థ నిర్మాణం చేపట్టిన రోడ్లు ఎన్నో ఏళ్ళు మన్నికగా ఉంటాయని అనుకున్నా ప్రజలకు మూడేళ్లకే రోడ్లు అక్కడక్కడ పగుళ్లు రావడం ప్రధానంగా బ్రిడ్జిల వద్ద గుంతలు ఏర్పడడం చూసి ఆశ్చర్యపోతున్నారు. రహదారుల నిర్వహణ కై జాతీయస్థాయిలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయిస్తూ, ఎప్పటికప్పుడు రోడ్లు మరమ్మత్తులు చేస్తూ వాహనాదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలంటున్నారు. అనుకుంటున్న సంకల్పానికి అధికారులు, సిబ్బంది, నిర్లక్ష్యం పెను సవాల్ గా మారింది. అల్లాదుర్గం మండలం చిల్వర్, బోడ్మాట్, పల్లి శివారులోని ముప్పారం బ్రిడ్జి వద్ద సర్వీస్ రోడ్డు పై గుంతలు ఏర్పడటంతో బొడ్మాట్ పల్లి మీదుగా నారాయణఖేడ్, జహీరాబాద్ వెళ్ళే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సైడ్ మిర్రర్ ఏర్పాటు లేక అధిక ప్రమాదాలు..

జాతీయ రహదారి వెంట ఏర్పాటు చేసిన బ్రిడ్జిల వద్ద సైడ్ మిర్రర్ ఏర్పాటు చేయకపోవడంతో అధిక ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు జాతీయ రహదారి సంస్థ బ్రిడ్జిల వద్ద సైడ్ మిర్రర్లను ఏర్పాటు చేస్తుంది. కానీ అలాంటి సైడ్ మిర్రర్ బ్రిడ్జిల్లా వద్ద ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలకు తావిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు.

హైవే అధికారుల పర్యవేక్షణ లోపం...

జాతీయ రహదారుల గుండా హైవే అథారిటీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా వారి పర్యవేక్షణనే కరువైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే రహదారి పై అక్కడక్కడ పగుళ్లు ఏర్పడి గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారి సంస్థ అధికారులు పర్యవేక్షించి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.

Tags:    

Similar News