రైతాంగం కోసమే కొండపోచమ్మ సాగర్ నిర్మాణం.. వంటేరు ప్రతాప్ రెడ్డి..

రైతాంగం కోసమే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారని, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-22 14:53 GMT

దిశ, గజ్వేల్ రూరల్ : రైతాంగం కోసమే కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టారని, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం గజ్వేల్ ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫాంహౌస్ కోసమే చేసుకున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బేషరతుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్నారన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి కుంభకోణాలు చేస్తున్నది కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు అని ఆరోపించారు. వారికి ప్రాజెక్టుల పై అవగాహన లేదని, కొండపోచమ్మ సాగర్, కృష్ణ పరివాహక ప్రాంతం మధ్యన ఉన్నదన్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్ వరకు గ్రావిటీ కింద నీళ్ళు పంపవచ్చని, ఆలేరు, భువనగిరి, కామారెడ్డి, రామాయంపేట, సంగారెడ్డి వరకు నీళ్ళు వెళ్తున్నాయన్నారు. కొండపోచమ్మ నుంచి తెలంగాణలో అన్ని ప్రాంతాలకు నీరు పంపవచ్చని నిర్మాణం చేశారన్నారు. కేసీఆర్ ఫాం హౌస్ కోసమే నిర్మాణం చేశారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావ్ పై భూములు కబ్జా చేశారని అంటున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

దమ్ముంటే హరీష్ రావు చెప్పిన సవాల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు స్వీకరించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. చేతకాని మాటలు అబద్ధపు మాటలు అసమర్ధపు మాటలు మూర్ఖత్వపు మాటలు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటికి ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చి 11 నెలల నుండి ఏ మీటింగ్ లు పెట్టినా కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ పేరు చెప్పుకోకపోతే బతికే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ మంత్రులు కానీ లేరన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా వాటిని మభ్యపెట్టేందుకు కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రజలు ఏమి అనుకుంటున్నారో మీరు చూడాలన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మీకు సరైన టైంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ అవినీతి నాయకులు ఊర్లలో తిరిగితే ప్రజలు తన్ని తరిమేస్తారని అన్నారు.

వడ్లు కొనుగోలు, ఆరు గ్యారంటీలు, 24 గంటల కరెంటు ఇవ్వడంలో విఫలం అయ్యారన్నారు. తూతూ మంత్రంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు దర్శనమిస్తున్నాయని, ఇది ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటని వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్ధేవ చేశారు. హరీష్ రావ్ చేసిన కబ్జాలను చూపించండి అంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నుండి వెళ్లిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి తిరిగి ఎన్నికలకు రావాలని, అందులో ఒక్కరు కూడా గెలవరన్నారు. ఇప్పటికైనా అసత్యాలు అబద్ధాలు మాట్లాడకుండా మూర్ఖత్వపు మాటలు మాట్లాడకుండా ప్రజలకు ఇచ్చిన 420 హామీలను ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని వంటేరు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మీ విధానాల వల్ల దివాలా తీస్తా ఉంటే పాలన మీద దృష్టి పెట్టకుండా రోజుకో డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మిమ్మల్ని మీ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అతి త్వరలో బొంద పెడతారని వంటేరు ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మండల పార్టీ అధ్యక్షుడు బెండ మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, కౌన్సిలర్లు ఉప్పల మిట్టయ్య, తలకొక్కుల దుర్గాప్రసాద్, అల్వాల బాలేష్, శ్యామల మల్లేశం, సీనియర్ నాయకుడు నర్సింగరావు, ఆర్కే శీను, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు దయాకర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మామిడి శ్రీధర్, కటిక శీను, మాజీ కో ఆప్షన్ ఖాసీం, గంగిశెట్టి రవీందర్, నాయకులు ఉమర్, అహ్మద్, తదితరులున్నారు.


Similar News