ఇట్లుంటే తినేదేట్లా..!?
పకడ్బందీగా పంపిణీ చేసే పౌర సరఫరాలో ఎర్రటి రంగు, ముక్కిన బియ్యం దర్శనమిచ్చాయి. వండితే నోట్లో పెట్టలేని విధంగా ఉన్నాయి.
దిశ, మెదక్ ప్రతినిధి : పకడ్బందీగా పంపిణీ చేసే పౌర సరఫరాలో ఎర్రటి రంగు, ముక్కిన బియ్యం దర్శనమిచ్చాయి. వండితే నోట్లో పెట్టలేని విధంగా ఉన్నాయి. రేషన్ షాపులకు వచ్చిన లబ్ధిదారులు ఈ బియ్యం ఎలా తినాలనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల రేషన్ షాపులకు వచ్చిన బియ్యం నాసిరకంగా ఉండటంతో ప్రజలు తీసుకెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అన్ని పరీక్షలు జరిపిన తర్వాత వచ్చే రేషన్ బియ్యం షాప్ లకు ఎలా వచ్చిందో అధికార యంత్రాంగానికే తెలియాలని ప్రజలు వాపోతున్నారు. మెదక్ జిల్లాలో ప్రతి నెల 3,672 మెట్రిక్ టన్నుల బియ్యం 521 రేషన్ షాపుల ద్వారా 2,13,860 తెలుపు, అంత్యోదయ, అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం పేదలకు ప్రధాన ఆధారం. ఒక నెల బియ్యం పంపిణీ జరగకున్న పస్తులు ఉండే కుటుంబాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ప్రధానంగా పెరిగిన బియ్యం ధరల మూలంగా అత్యధిక మంది నిరుపేదలు రేషన్ బియ్యం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే బియ్యాన్ని తీసుకునేందుకు షాప్ ల వద్ద నిరుపేదలు క్యూలు కడతారు.
చూస్తేనే తినలేని విధంగా రేషన్ బియ్యం..!
మెదక్ జిల్లాల్లో 521 రేషన్ షాప్ లకు ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం చాలా షాప్ లకు నాసిరకంగా వచ్చాయి. మెదక్ పట్టణం లో 1,2 షాపులతో పాటు పలు షాప్ లకు ఎర్రగా, ముక్కున, నూకల విధంగా ఉన్న బియ్యం సరఫరా అయ్యాయి. అలాగే జిల్లాలోని చేగుంట మండలం ఇబ్రహీంపూర్, ఉల్లి తిమ్మాయిపల్లి, రెడ్డి, పల్లి, కొండాపూర్ తో పాటు జిల్లా పరిధిలోని నర్సాపూర్, రామాయంపేట, చిన్న శంకరం పేట, కొల్చారం తదితర మండలాల పరిధిలోని రేషన్ షాప్ లకు నాసిరకంగా రేషన్ బియ్యం వచ్చాయి. పౌర సరఫరా శాఖ పంపిణీ చేసిన బియ్యం సంచులు విప్పిన కొలది అందులో నాసిరకం బియ్యం రావడం మూలంగా వాటిని తీసుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని షాప్‌ల్లో ఇచ్చిన బియ్యం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చిన బియ్యం పూర్తిగా నాసిరకంగా ఉండడం తో వాటిని ఎలా తినాలి అనే సందేహం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ముక్కున, నూకలు, ఎర్ర రంగు ఉన్న బియ్యాన్ని ఇస్తే ఎలా తీసుకువెళ్లాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో దాదాపు 250 రేషన్ షాపు లకు నాసిరకం బియ్యం సరఫరా అయినట్టు డీలర్ లే చెబుతున్నారు. కొన్ని షాపుల వద్ద ప్రజలు ఎలాంటి బియ్యం ను ప్రభుత్వం ఎలా సరఫరా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం బియ్యం మాకు వద్దని కొన్ని గ్రామాల్లో ప్రజలు నిరాకరిస్తున్నారు.
నాసిరకం బియ్యం ఎక్కడివి..!
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే బియ్యం ప్రతి నెల పక్కగా సరఫరా చేస్తుంది. కానీ ఆగస్టు మాసం కోసం పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా ఉండడం పై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అన్ని పరీక్షలు చేసి షాప్ లకు పంపించే బియ్యం కొన్ని షాప్ లకు మాత్రం నాసిరకంగా ఎలా వచ్చిందన్న అనుమానాలు కలుగుతున్నాయి. సివిల్ సప్లై గోదాం ల నుంచి వచ్చాయా లేక మధ్యలో ఏవైనా మార్పు జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జరిగిన లోపాలపై అధికారులు స్పందించి నాసిరకం బియ్యం మార్చి నాణ్యమైన బియ్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు.