పేద విద్యార్థులంటే పట్టించుకోరా.. రోడ్డు ఇలా పాఠశాలకు వెళ్లేదెలా..?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంటే అధికారులకు అలుసుగా

Update: 2024-08-26 10:38 GMT

దిశ, సంగారెడ్డి : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంటే అధికారులకు అలుసుగా మారింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని హాస్టల్ గడ్డలో తెలుగు, ఉర్దూ మీడియం ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల నిర్మాణానికి ఓ వెంచర్ యజమాని సుమారు ఆరు గుంటల భూమి విరాళంగా ఇవ్వడం తో తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాలలను ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉన్నా ఆ పాఠశాలకు వెళ్లేందుకు ఉన్న దారి నిర్మాణాన్ని మరిచారు. వానాకాలంలో వర్షాలు పడుతుండడం వల్ల వరదలు రావడం తో పాఠశాలకు వెళ్లేందుకు దారి లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో చదివేది ఐదు తరగతులు వరకు విద్యార్థులే. ముఖ్యంగా వీరంతా హాస్టల్ లో ఉంటూ విద్యను అభ్యసిస్తున్న పేద పిల్లలు. వీరు పాఠశాలకు వెళ్లాంటే మోకాలు లోతు నీటిలో పాఠశాలకు చేరుకోవాల్సిందే. ప్రతి రోజు ఇదే తంతు గా మారింది. ఈ పాఠశాలలను పట్టించుకున్నవారు లేకపోవడంతో విద్యార్థులు నరకయాతన పడుతున్నారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ప్రధానోపాధ్యాయురాలు..

పాఠశాలకు వెళ్లేందుకు దారి లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న ఇబ్బందులు ప్రధానోపాధ్యాయురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ పాఠశాలకు రోడ్డు వేయాలంటే మున్సిపల్ అధికారులు వేయాలని విద్యాశాఖ అధికారులు అంటుండగా అది మాది కాదు విద్యాశాఖ అధికారులు వేసుకోవాలని మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. అది కాదు పాఠశాల వెంచర్ లో ఉన్నది కాబట్టి వెంచర్ యాజమాన్యం రోడ్డు వేయాలని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. వెంచర్ యజమాని భూమిని పాఠశాలకు దానం చేస్తే ఆ భూమిలో పాఠశాలను నిర్మించారు. కానీ ఆ పాఠశాలకు రోడ్డు నిర్మాణం వెంచర్ యజమాని వేయాలనడం ఎంతవరకు కరెక్టో అధికారులకే తెలియాలి మరి. రెండు శాఖల సమన్వయ లోపంతో పాఠశాలకు వెలుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులకు మాత్రం శాపంగా మారింది. విద్యార్థులకు రోడ్డు సౌకర్యం లేక పక్కనే ఉన్న పొలాల గట్ల నుంచి ప్రమాదకరంగా పాఠశాలకు వెలుతున్నారు. కానీ వర్షం వల్ల పొలం గట్లపై నుంచి వెళ్లేందుకు కూడా దారి మూసుకుపోయింది. అదే విధంగా పొలం గట్ల పక్కన వరద కాలువ ఉంది. ఆ కాలువ పెద్ద ఎత్తున ప్రవహిస్తుండడంతో విద్యార్థులకు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఉపాధ్యాయులు చింతిస్తున్నారు.

పాఠశాలకు వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు..

పాఠశాలకు వెళ్లే రెండు దారులు మూసుకుపోయాయి. వర్షాలు పెద్ద ఎత్తున రావడంతో పాఠశాలకు వెళ్లేందుకు చేను గట్ల నుంచి వెళ్లే దారి సైతం మూసుకుపోయింది. అది కాకుండా పాఠశాలకు డైరెక్టుగా వెళ్లే రోడ్డు పూర్తిగా నీటిమయమయ్యింది. పాఠశాలకు వెళ్లాలంటే చిన్న పిల్లలు ఎలా వెళ్లి చదువుకోవాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు దారి లేదంటే అక్కడ పాఠశాలను ఎందుకు నిర్మించారంటూ చుట్టు పక్కల వారు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టే బదులు ఇతర చోట పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో పాత ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. వాటిలో ఎందులో అయినా పాఠశాలను ఏర్పాటు చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పనున్నాయి. విద్యార్థుల ఇబ్బందులపై కలెక్టర్, డీఈఓ స్పందించాలని పలువురు కోరుతున్నారు.


Similar News